అమెరికా వాయేజర్ స్కాలర్‌షిప్‌కు రిత్విక్ కొర్రపాటి ఎంపిక
రిత్విక్ కేఆర్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ సుధాకర్ వారసుడే
అమెరికా వ్యాప్తంగా 100 మందికే అవకాశం
మండలంలో పలువురు హర్షం
కాకతీయ ప్రతినిధి, ఏలూరు : అమెరికాలోని ప్రతిష్టాత్మక ది ఒబామా చెస్కీ వాయేజర్ స్కాలర్‌షిప్ ఫర్ పబ్లిక్ సర్వీస్‌కు మండలంలోని తడికలపూడిలోని కేకేఆర్ బ్రైట్‌మైండ్ స్కూల్ చైర్మన్ డాక్టర్ కొర్రపాటి సుధాకర్, డాక్టర్ గీత దంపతుల రెండో కుమారుడు కొర్రపాటి రిత్విక్ ఎంపికయ్యారు. అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ బహుమతి విజేత బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా, ఎయిర్‌బీఎన్‌బీ వ్యవస్థాపకులు బ్రయాన్ చెస్కీ కలిసి ప్రారంభించిన ఈ స్కాలర్‌షిప్‌లో అమెరికా దేశ వ్యాప్తంగా 100 మందికే అవకాశం దక్కుతుంది. రెండేళ్ల నాయకత్వ స్కాలర్‌షిప్ కార్యక్రమంలో ప్రజాసేవ పట్ల ఆసక్తిఉన్న యువతను భావి నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా కళాశాలల్లో రెండో సంవత్సరం పూర్తి చేసి మూడో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న లక్షలాది మంది విద్యార్థుల నుంచి కేవలం 100 మందిని మాత్రమే ఎంపిక చేస్తే.. అందులో కొర్రపాటి సుధాకర్ తనయుడు రిత్విక్ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఎంపిక కావడం విశేషం. సమాజ సేవ, ప్రజాహితం, నాయకత్వ లక్షణాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ కార్యక్రమం ప్రత్యేక అవకాశాలను అందిస్తుందని డాక్టర్ సుధాకర్ తెలిపారు. సమాజానికి మేలు చేయాలనే దృక్పథంతో పాటు నాయకత్వ లక్షణాలను ప్రదర్శించిన కొర్రపాటి రిత్విక్ ఈ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. వాయేజర్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన చిరంజీవి రిత్విక్‌కు కేఆర్ఆర్ విద్యాసంస్థల సిబ్బంది, మండలంలోని పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

