వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు అండగా ఉంటా..
పేదల భూములపై పెద్దల కన్ను..
అర్హులందరికీ పట్టాలిచ్చి పక్కా ఇళ్లు నిర్మించాలి : మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్..
కాకతీయ, హనుమకొండ : వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పేదల హక్కులకు భంగం కలిగిస్తే సహించేది లేదని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. పేదలు నివసిస్తున్న భూములపై కొందరు పెద్దలు కన్నేశారని, గుడిసెవాసులను బెదిరిస్తూ వారి స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బుధవారం హనుమకొండ వడ్డేపల్లిలోని తన నివాసంలో వైఎస్సార్ నగర్ గుడిసెవాసులు దాస్యం వినయ్ భాస్కర్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. కాంగ్రెస్ నాయకులు తమను బెదిరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ లిఖితపూర్వక వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు. బాధితుల సమస్యలను తెలుసుకున్న వినయ్ భాస్కర్ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ నగర్లో పేదలు నివాసముంటున్న భూములపై కొందరు బడాబాబుల కన్ను పడిందని విమర్శించారు. సీలింగ్ చట్టం పరిధిలో ఉన్న భూముల్లో నిర్మాణాలు చేపట్టడం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వాటికి అనుమతులు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. పేదలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకులు గుడిసెవాసులను భయభ్రాంతులకు గురిచేస్తూ, వారు నివసిస్తున్న స్థలాలను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పేదల నివాసాలను తొలగించడం, వారిని బెదిరించడం వంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. వైఎస్సార్ నగర్లో నివసిస్తున్న అర్హులైన గుడిసెవాసులందరికీ ప్రభుత్వం తక్షణమే పట్టాలు పంపిణీ చేయాలని, వారికి అదే ప్రాంతంలో పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేద ప్రజల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ నగర్ కాలనీవాసులు, మహిళలు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

