ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే
గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే అత్యధిక మెజార్టీ రావాలి
అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి : మంత్రి శ్రీధర్‌బాబు
కాకతీయ, శంషాబాద్ : హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని సూచించారు. గురువారం శంషాబాద్‌లోని మల్లికా గార్డెన్స్‌లో నిర్వహించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు చేపట్టాలని శ్రీధర్‌బాబు సూచించారు. బూత్ స్థాయి నుంచి ప్రతి పట్టభద్రుడిని నేరుగా కలిసి ఓటరుగా నమోదు చేయించే బాధ్యతను నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఓటరు నమోదు, ఎన్నికల ప్రచారంలో అత్యుత్తమంగా పనిచేసే నాయకులు, కార్యకర్తలకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలని మంత్రి సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు పాత, కొత్త నాయకులంతా విభేదాలను పక్కనబెట్టి సమన్వయంతో ముందుకెళ్లాలని శ్రీధర్‌బాబు అన్నారు. బూత్ స్థాయి నుంచి పక్కా ప్రణాళికతో పనిచేస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌కు అత్యధిక మెజార్టీ సాధించడం సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, మనోహర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ఏఐసీసీ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు పారిజాత నర్సింహారెడ్డి, వజ్రేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

