భూమునిపాదం జలపాతం ఈడీసీలో నిధుల గోల్‌మాల్!
సభ్యుల సంతకాల ఫోర్జరీతో నిధుల స్వాహా?
2024 ఏప్రిల్ నుంచి ఐదుగురు కార్మికులకు అందని వేతనాలు
అటవీ శాఖ అధికారుల తీరుపై తీవ్ర ఆరోపణలు
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతనగరం పరిధిలోని భూమునిపాదం జలపాతం వద్ద ఉన్న పర్యావరణ అభివృద్ధి కమిటీలో నిధుల అక్రమ వినియోగం జరిగినట్లు ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. కమిటీ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి భారీగా నిధులు కాజేశారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. జలపాతం వద్ద పర్యాటకులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంతోపాటు చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు ఐదుగురు కార్మికులను కమిటీ ఏర్పాటు చేసింది. అయితే 01-04-2024 నుంచి ఇప్పటివరకు వారికి వేతనాలు అందలేదని సమాచారం. ఉన్నతాధికారుల అనుమతులు లేవనే అంశాన్ని ఆసరాగా చేసుకుని నిధుల మళ్లింపునకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యాటక ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం, మరోవైపు కమిటీ సభ్యుల సంతకాల ఫోర్జరీతో నిధుల స్వాహా జరిగిందనే ఆరోపణలు రావడం పలు సందేహాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై సంబంధిత అటవీ శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, నిధుల లావాదేవీల వివరాలను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.

