ముదిరాజుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలి
జనాభాకు అనుగుణంగా సంక్షేమ ఫలాలు అందించాలి
గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక చైతన్యం పెంచాలి
ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పిలుపు
కాకతీయ, మహబూబాబాద్ : రాజకీయ పార్టీలు ముదిరాజులను ఓటు బ్యాంకుగా వినియోగించుకోవడం కాకుండా, వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు. జనాభాకు అనుగుణంగా సంక్షేమ ఫలాలు అందించి, అభివృద్ధిలో భాగస్వాములను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన కీర్తిశేషులు పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ముదిరాజులను చైతన్యపరిచేందుకు సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని కోరారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ పండుగ సాయన్న పోరాట స్ఫూర్తి, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను వివరించారు. మున్సిపల్ చైర్మన్ గుగులోత్ జ్యోతి రమేష్ ముదిరాజుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సాయి శ్రీజ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పురుషోత్తం, జిల్లా నాయకులు, మత్స్య సహకార సంఘాల నాయకులు, ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు పండుగ సాయన్న జీవితంపై రూపొందించిన లఘుచిత్రాన్ని ప్రదర్శించారు.

