నూతన క్రిమినల్ చట్టాలపై సాయుధ దళాలకు శిక్షణ
971 మంది సిబ్బందికి 20 బ్యాచ్‌లుగా శిక్షణ
ఎఫ్ఐఆర్ నమోదు నుంచి సాక్ష్యాల సేకరణ వరకు అవగాహన
పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఆధ్వర్యంలో కార్యక్రమం
కాకతీయ, వరంగల్ బ్యూరో : నూతన క్రిమినల్ చట్టాలపై పోలీసు సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ సూచనల మేరకు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత కార్యాచరణ రూపొందించారు. కమిషనరేట్ పరిధిలోని సాయుధ దళాల్లో కానిస్టేబుల్ నుంచి కమాండెంట్ స్థాయి వరకు పనిచేస్తున్న 971 మంది సిబ్బందిని 20 బ్యాచ్‌లుగా విభజించి, మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో రోజుకు ఒక బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వనున్నారు. శనివారం ఏసీపీ, శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపల్ రమణబాబు పర్యవేక్షణలో తొలి బ్యాచ్‌కు శిక్షణ నిర్వహించారు. ఎఫ్ఐఆర్ నమోదు, అరెస్టుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేరస్థలంలో సాక్ష్యాల సేకరణ, ధర్నాల నిర్వహణ, ముందస్తు అరెస్టులు, నేరాల వర్గీకరణపై వివరించారు. మహిళలపై నేరాలు, ఉగ్రవాద నిరోధక చట్టాలు, సైబర్ నేరాలు, నేర విచారణలో పోలీసుల అధికారాలపైనా అవగాహన కల్పించారు. ప్రధాన న్యాయ శిక్షకుడు, ఇన్స్పెక్టర్ సూర్యప్రకాశ్, సహాయక న్యాయ శిక్షకులు, ఎస్ఐలు విజయ్, దేవేందర్, ఆర్ఐ ఉదయభాస్కర్, ఆర్ఎస్ఐ రమేష్‌తో పాటు శిక్షణ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.


