సర్పంచులను పక్కనపెట్టి ఇళ్ల ఎంపిక సరికాదు
గ్రామసభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలి
జీవో 33, హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి
బీఆర్ఎస్ నేతలు బానోతు సారంగపాణి, చెట్టుపల్లి మురళీధర్ డిమాండ్
కాకతీయ, నల్లబెల్లి : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను సర్పంచుల అధ్యక్షతన గ్రామసభల ద్వారానే చేపట్టాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ డిమాండ్ చేశారు. శనివారం నల్లబెల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 33, హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా సర్పంచులను పక్కనపెట్టి కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పేరుతో కొందరు అధికార పార్టీ నాయకులు పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అర్హులైన పేదలకు పారదర్శకంగా ఇళ్లు మంజూరు చేయాలని, లేకపోతే మండలవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సర్పంచుల ఫోరం నాయకులు పులి రమేష్ గౌడ్, జాటో రవి చిన్న, మచ్చిక రవి, ఇంగ్లీ శివాజీ, సర్పంచులు దండెం సంపత్, నాగలి జ్యోతి ప్రకాష్, మంద సుజాత రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

