ఓటు బచావో–దేశ్ బచావో..
ఢిల్లీకి మాదిగలు తరలిరావాలి
నవంబర్ 1న రామ్‌లీలా మైదానంలో నిరసన కార్యక్రమం
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పెరుమాండ్ల రామకృష్ణ
కాకతీయ, హన్మకొండ : ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ కోసం నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమానికి తెలంగాణ నుంచి మాదిగలు, దళితులు, బహుజనులు భారీగా తరలిరావాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ పిలుపునిచ్చారు. దళితులు ఓట్లు వేస్తేనే కేసీఆర్ గెలిచారంటూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దళిత సమాజాన్ని కించపరిచేలా మాట్లాడటం తగదన్నారు. స్వేరో కమాండ్మెంట్స్, నీతి, నిజాయితీ గురించి మాట్లాడిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ప్రభావంతో మాట్లాడుతున్నారనే భావన కలుగుతోందని వ్యాఖ్యానించారు. మాదిగ హక్కుల దండోరా హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా వక్కల ప్రభాకర్‌ను నియమించినట్లు ప్రకటించారు. నియోజకవర్గాల ఇన్చార్జులుగా పులి శ్రీనివాస్, కొట్టె రమేష్, కొట్టె రాజు, గబ్బెట సుధాకర్ తదితరులను నియమించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, పదవీ విరమణ చేసిన ప్రధానోపాధ్యాయుడు కొమ్ముల బాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడేందుకు నిరసన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారు కోరారు.

