16 మండలాల్లో మూడింటికే సరిపడా వర్షాలు
రోజుకు 6 వేల నుంచి 8 వేల ట్యాంకర్లకు డిమాండ్
మూడు, నాలుగు రోజులకోసారి తాగునీటి సరఫరా
సింగూరు జలాశయంలో 29.9 టీఎంసీలకు 3.4 టీఎంసీలే
డిసెంబరు నాటికి జలాశయాలు అడుగంటుతాయన్న ఆందోళన
25 ఏళ్ల క్రితం నాటి సంక్షోభం మళ్లీ వస్తుందా?
కాకతీయ, తెలంగాణ బ్యూరో : భాగ్యనగరాన్ని నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సాధారణ వర్షపాతం అందకపోవడంతో నగరంలోని 16 మండలాల్లో కేవలం మూడింటికే సరిపడా వర్షాలు నమోదయ్యాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజువారీ ట్యాంకర్ బుకింగ్‌లు 6 వేల నుంచి 8 వేల వరకు చేరినట్లు సమాచారం. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌తోపాటు నగర శివారు ప్రాంతాల్లో మూడు, నాలుగు రోజులకోసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోందని నివేదిక పేర్కొంది. పాతికేళ్ల క్రితం జలాశయాల్లో నీటిమట్టాలు పడిపోయి నగరం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న పరిస్థితులు మళ్లీ పునరావృతమవుతాయా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ నగరానికి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, సింగూరు, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి నీరు సరఫరా అవుతోంది. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల నుంచి వచ్చే నీటిపై కూడా నగర అవసరాలు ఆధారపడి ఉన్నాయి. అయితే వర్షాలు తక్కువగా కురవడంతో ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. నీటిపారుదల శాఖ గణాంకాల ప్రకారం.. 3.5 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యమున్న ఉస్మాన్‌సాగర్‌లో ప్రస్తుతం 2.2 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 2.5 టీఎంసీల సామర్థ్యమున్న హిమాయత్‌సాగర్‌లో 2.1 టీఎంసీలు మిగిలాయి. సింగూరు జలాశయంలో 29.9 టీఎంసీలకు గాను 3.4 టీఎంసీలే ఉన్నాయి. 312 టీఎంసీల సామర్థ్యమున్న నాగార్జునసాగర్‌లో 184.2 టీఎంసీల నీరు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

మూడు రోజులకోసారి నీటి సరఫరా
జలాశయాల్లో నిల్వలు తగ్గుతుండటంతో నీటి వినియోగంపై హైదరాబాద్ జలమండలి ఆంక్షలు విధించే దిశగా చర్యలు చేపట్టింది. సాధారణంగా ఒక రోజు విడిచి మరో రోజు సరఫరా చేసే ప్రాంతాల్లోనూ మూడు రోజులకోసారి నీటిని అందించే పరిమిత విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి సమీక్ష సమావేశంలో వెల్లడించారు. మిగిలిన నీటిని పొదుపుగా వినియోగించుకోవడమే లక్ష్యమని పేర్కొన్నారు.మరోవైపు ట్యాంకర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అదనపు ట్యాంకర్ నిర్వాహకులను జలమండలిలో నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు. అవసరమైన ప్రాంతాలకు నీటిని అందించేందుకు సరఫరా వ్యవస్థను విస్తరించే చర్యలు చేపడుతున్నారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు గోదావరి తాగునీటి పథకం ద్వారా అదనపు నీటిని తీసుకురావడం, కృష్ణా జలాల సరఫరాను పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అశోక్‌రెడ్డి తెలిపారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల్లో అదనపు వడపోత పడకల ఏర్పాటుపైనా ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. నిర్మాణ రంగం, ఉద్యానవనాలు, పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించే అవకాశాలనూ పరిశీలిస్తున్నారు. దీంతో తాగునీటి అవసరాలకు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.

భూగర్భ జలాలపై ఆడిట్
నగర పరిధిలోని 16 మండలాల్లో భూగర్భ జల వనరుల పరిస్థితిని అంచనా వేసేందుకు జలమండలి నీటి ఆడిట్ నిర్వహిస్తోంది. నీటిని పొదుపుగా వినియోగించుకోవడంతోపాటు విద్యుత్ వినియోగాన్ని తగ్గించే ముందస్తు చర్యలు చేపట్టాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాకు రాబోయే నెలల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు అత్యవసర సమీక్ష నిర్వహించారు. సంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల సంరక్షణపై దృష్టి సారిస్తే నగర నీటి అవసరాలను తీర్చడంలో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది.
ప్రైవేటు ట్యాంకర్లకు భారీగా పెరిగిన గిరాకీ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నీటి సమస్య పెరుగుతున్న నేపథ్యంలో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఇళ్ల అవసరాలతోపాటు భవన నిర్మాణాలు, ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలకు నీరు తప్పనిసరి కావడంతో ట్యాంకర్ల కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు మార్కెట్‌లో ట్యాంకర్లకు గిరాకీ పెరుగుతోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (జలమండలి)కు రోజుకు సుమారు 8 వేల ట్యాంకర్ల కోసం దరఖాస్తులు వస్తున్నట్లు అందిన సమాచారం ఈ డిమాండ్ తీవ్రతను తెలియజేస్తోంది. నగరంలో నీటి అవసరాలు పెరగడంతో జలమండలి ద్వారా ట్యాంకర్లను బుక్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇళ్ల నిర్మాణాలు, శుభకార్యాలు, ఇతర అవసరాల కోసం నీటిని ట్యాంకర్ల ద్వారా తెప్పించుకుంటున్నారు. రోజుకు సుమారు 8 వేల ట్యాంకర్లకు డిమాండ్ ఉండటంతో సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. జలమండలికి దరఖాస్తు చేసుకున్న వారికి 24 గంటల్లోపు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. డిమాండ్ పెరుగుతున్న కొద్దీ నిర్ణీత సమయంలో సరఫరా చేయడం కీలకంగా మారుతోంది. అవసరమైన చోట నీరు అందుబాటులో లేకపోతే వినియోగదారులు ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జలమండలి ద్వారా సరఫరా చేసే ట్యాంకర్ల చార్జీలు బయట మార్కెట్‌తో పోలిస్తే తక్కువగా ఉంటాయి. ప్రైవేటు ట్యాంకర్లకు ప్రస్తుతం రూ.8వేల నుంచి రూ.10వరకు డిమాండ్ నెలకొన్నట్లుగా భాగ్యనగరవాసులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జలమండలి సరఫరా, ప్రైవేటు ట్యాంకర్ల ధరల మధ్య వ్యత్యాసం వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశాన్ని సూచిస్తోంది.
సున్నం చెరువులో అక్రమ నీటి దందా!
మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిధిలో సాగుతున్న అక్రమ నీటి విక్రయాల వ్యవహారంపై హైడ్రా చర్యలు చేపట్టింది. బస్తీల్లో రహస్యంగా బోర్లు వేసి, భారీ పైపుల నెట్‌వర్క్ ద్వారా నీటిని ట్యాంకర్లకు సరఫరా చేస్తున్న వ్యవస్థను అధికారులు గుర్తించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన బోర్లను తొలగించడంతోపాటు నీటి సరఫరాకు ఉపయోగిస్తున్న పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేశారు. ప్రమాదకర లోహాలు కలిగిన నీటిని తాగునీటిగా విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. అయితే నీటిలో ఏయే లోహాలు ఎంత మోతాదులో ఉన్నాయనే అంశంపై అధికారిక పరీక్షల నివేదికలు వెలువడాల్సి ఉంది. సున్నం చెరువు పరిధిలో అక్రమంగా నీటిని వెలికితీసి విక్రయిస్తున్న వ్యవస్థపై హైడ్రా దృష్టి సారించింది. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బోర్లు, నీటిని ట్యాంకర్లకు తరలించేందుకు ఉపయోగిస్తున్న పైపుల నెట్‌వర్క్‌పై చర్యలు తీసుకుంది. ప్రజారోగ్యానికి ముప్పు కలిగించేలా కలుషిత నీటిని విక్రయిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నీటి నాణ్యతపై పరీక్షల ఫలితాలు వెలువడితేనే అందులోని లోహాల స్థాయిపై స్పష్టత రానుంది. మరోవైపు సున్నం చెరువు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. చెరువుకు సంబంధించిన దాదాపు 20 ఎకరాల పూర్తి స్థాయి నీటిమట్టం హద్దులను నిర్ధారించి, పూడికతీత నుంచి ఫెన్సింగ్ ఏర్పాటు వరకు పనులు చేపట్టారు. చెరువు చుట్టూ నిర్మించిన ఎత్తయిన బండ్, వాకింగ్ ట్రాక్‌లను అధికారులు పరిశీలించారు. లోపలి, బయటి వైపుల ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ పనులనూ తనిఖీ చేశారు. ఆక్రమణల తొలగింపుతో చెరువుతోపాటు పరిసర ప్రాంతాలను కలిపి దాదాపు 30 ఎకరాల మేర అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు.

