బాణాసంచా విక్రయాలకు నవంబర్ 2లోపు దరఖాస్తు
తాత్కాలిక దుకాణాలకు తప్పనిసరిగా అనుమతులు
అవసరమైన ధ్రువపత్రాలు, బ్యాంకు చలాన్ సమర్పించాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సూచన
కాకతీయ, వరంగల్ బ్యూరో : దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణాసంచా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకునే వ్యాపారులు నవంబర్ 2వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సూచించారు. అవసరమైన ధ్రువపత్రాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత డీసీపీ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. దరఖాస్తుతో పాటు అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రం, స్థల యజమాని లేదా సంబంధిత ప్రభుత్వ అధికారి అనుమతి పత్రం, వస్తు సేవల పన్ను నమోదు ధ్రువపత్రం జతచేయాలని పేర్కొన్నారు. గతంలో లైసెన్స్ పొందినవారు దాని ప్రతిని, అవసరమైన చోట్ల పక్క స్థలాల యజమానుల అనుమతి పత్రాలు, స్థలానికి సంబంధించిన పటాన్ని సమర్పించాలన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధాలత్ శాఖలో ప్రభుత్వ ఖజానాకు రూ.800 చెల్లించిన బ్యాంకు చలాన్‌ను కూడా జతచేయాలని సూచించారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం సంబంధిత డీసీపీ స్థాయి అధికారులు అనుమతులు జారీ చేస్తారని తెలిపారు. అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు చేపడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎన్. శ్వేత హెచ్చరించారు. వ్యాపారులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకుని, భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

