వాల్మీకి ఆశయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం
రామాయణంతో ధర్మ మార్గాన్ని చాటిన మహర్షి
మానవత్వం, సమానత్వం, సోదరభావం ఆయన బోధనల సారం
వాల్మీకి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
కాకతీయ, వరంగల్ బ్యూరో : వాల్మీకి మహర్షి ఆశయాలు, బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకుని వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామాయణ మహాకావ్యాన్ని రచించి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలు, ధర్మ మార్గాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు వాల్మీకి అని కొనియాడారు. వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ఆయన బోధనలు సమాజంలో మానవత్వం, సమానత్వం, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు నైతిక విలువల పరిరక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, భావితరాలకు మంచి విలువలను అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వాల్మీకి సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

