విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం!
నిరంతరాయంగా వెలుగుతున్న వీధి దీపాలు
ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటున్న దేశాయిపల్లి గ్రామస్తులు
కాకతీయ, దుగ్గొండి : దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి దీపాలు నిరంతరాయంగా వెలుగుతూ విద్యుత్ వృథా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. విద్యుత్ సమస్యలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు గ్రామంలో పలుచోట్ల కేబుల్ వైర్లు కాలిపోవడంతో ప్రమాదాల భయం నెలకొందని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందని గ్రామస్తులు వాపోతున్నారు. అవసరమైన పరికరాలు అందుబాటులో లేవంటూ అధికారులు సమస్యలను పరిష్కరించడం లేదని విమర్శిస్తున్నారు. విద్యుత్ వృథాను అరికట్టడంతో పాటు కాలిపోయిన కేబుల్ వైర్లను తక్షణమే మార్చాలని కోరుతున్నారు. ప్రమాదాలు జరగకముందే ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలోని విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని దేశాయిపల్లి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

