కుస్తీలో సహస్రకు రాష్ట్ర స్థాయిలో స్వర్ణం
జాతీయ స్థాయి పోటీలకు దుగ్గొండి విద్యార్థిని అర్హత
ఢిల్లీలో జరిగే పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధం
సహస్రను సన్మానించిన రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శానబోయిన రాజ్‌కుమార్
కాకతీయ, దుగ్గొండి : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని వరంగల్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శానబోయిన రాజ్‌కుమార్ అన్నారు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడల్లో దుగ్గొండి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన యాదగిరి సహస్ర 33 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించి, ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రామస్వామి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సహస్రను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో ప్రతిభ చూపితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో పతకం సాధించి పాఠశాలకు పేరు తీసుకొచ్చిన సహస్రను ప్రధానోపాధ్యాయుడు రామస్వామి అభినందించారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ తోకల నర్సింహారెడ్డి, రెజ్లింగ్ జిల్లా బాధ్యులు, యాదగిరి సుధాకర్, సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్, ఉపసర్పంచ్ పల్లె వైష్ణవి శ్యామ్, గుండెకారి రవికుమార్, కూస రమేష్, కోచ్‌లు కందికొండ రాజు, దేవేందర్, ఫిజికల్ డైరెక్టర్ ఐలయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

