ఓవర్లోడ్, లో-వోల్టేజీ సమస్యలకు పరిష్కారం
శంకరాజుపల్లి, ముల్లెకట్టలో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు
కాకతీయ, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలంలోని శంకరాజుపల్లి, ముల్లెకట్ట గ్రామాల్లో తరచూ ఎదురవుతున్న విద్యుత్ ఓవర్లోడ్, లో-వోల్టేజీ సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రెండు గ్రామాల్లో అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి ఛార్జింగ్ చేశారు. విద్యుత్ వినియోగం పెరగడంతో సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమించి వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేపట్టారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు పనులను వేగంగా పూర్తి చేశారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ల అందుబాటుతో ఆయా గ్రామాల్లో ఓవర్లోడ్, లో-వోల్టేజీ సమస్యలు తగ్గి విద్యుత్ సరఫరా మెరుగుపడనుంది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ బిక్షపతి, డీఈ పురుషోత్తం, ఏడీఈ ఉమారావు, ఏఈ పండ్ల శేఖర్, లైన్ ఇన్స్పెక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

