గిరిజన దర్బార్‌లో వినతుల వెల్లువ
విద్య, రహదారులు, భూ సమస్యలపై అర్జీలు
వినతులను సత్వరమే పరిష్కరించాలి
ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో
కాకతీయ, ఏటూరునాగారం : ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌కు ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు వెల్లువెత్తాయి. విద్యుత్, భూ సమస్యలు, పాఠశాలల్లో మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీల నిర్మాణం, ఉద్యోగ నియామకాలు తదితర అంశాలపై ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో సంబంధిత అధికారులను ఆదేశించారు. పంట పొలాలకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని, కొండాయిలో గోవిందరాజుల జాతరకు అవసరమైన ఏర్పాట్లకు సహాయం అందించాలని ప్రజలు కోరారు. అంకంపల్లి పాఠశాలలో వంటశాల నిర్మాణం, ఇప్పలగడ్డ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రానికి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని వినతులు అందాయి. రాఘవపట్నం నుంచి రంగాపురం వరకు మట్టి రహదారి నిర్మాణంతోపాటు పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని దరఖాస్తులు సమర్పించారు. ఉద్యోగ నియామకాలు, డిప్యూటేషన్లు, 2012 డీఎస్సీ మెరిట్ జాబితా, డీఎల్‌ఎస్‌సీ వివరాలు, పెండింగ్ వేతనాల చెల్లింపు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా పాస్‌బుక్‌ల జారీకి సంబంధించి వినతులు అందాయి. ఇందిరా జలప్రభ పథకం కింద మూడు బోర్‌వెల్లు మంజూరు చేయాలని, గూడూరు మండలంలోని ఏకలవ్య పాఠశాల భూ సమస్యను పరిష్కరించాలని కోరారు. భూ ఆక్రమణకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అంశంపై కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన ఫిర్యాదును కూడా సమర్పించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పీఓ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ ప్రతాప్, ఏఓ అనిల్, డీడీ జనార్దన్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

