ఉపాధ్యాయ సంక్షేమ సంఘానికి నూతన కార్యవర్గం
అధ్యక్షుడిగా దామెరకొండ సదానందం ఏకగ్రీవ ఎన్నిక
ప్రధాన కార్యదర్శిగా జడల శ్రీనివాసరావు, కోశాధికారిగా కడారి మహేష్
23 ఏళ్ల సంఘ ప్రస్థానం.. 17 మంది విశ్రాంత ఉపాధ్యాయులకు సన్మానం
కాకతీయ, వరంగల్ : రంగశాయిపేట ఉపాధ్యాయ సంక్షేమ పరపతి సంఘం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం స్థాపించి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మూడోసారి అధ్యక్షుడిగా దామెరకొండ సదానందం, ప్రధాన కార్యదర్శిగా జడల శ్రీనివాసరావు, కోశాధికారిగా కడారి మహేష్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ సభ్యులకు ఆర్థిక భరోసా కల్పించడంతోపాటు ప్రతిభావంతులను ప్రోత్సహించే కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. 189 మంది సభ్యుల సహకారంతో సంఘం మరింత అభివృద్ధి చెందుతుందని శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో ఉద్యోగ విరమణ పొందిన 17 మంది సభ్యులతోపాటు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందిన ఎనిమిది మందిని సన్మానించారు. రాబోయే రెండేళ్లకు సంబంధించిన తీర్మానాలను చర్చించి ఆమోదించారు. ఉపాధ్యక్షులుగా కుమ్మరి బాబురావు, గుండు కామేశ్వర్రావు, సహాయ కార్యదర్శులుగా డాక్టర్ బొమ్మెర కుమారస్వామి, శేర్ల భాస్కర్, వళ్లాజి నర్సింహస్వామి ఎన్నికయ్యారు. మహిళా కార్యదర్శిగా కొత్తగట్టు కళ, ఇతర కార్యవర్గ సభ్యులు, శాశ్వత సభ్యులు, గౌరవ సలహాదారులు, ఆడిట్ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. సంఘం క్రమశిక్షణతో, పారదర్శకంగా కొనసాగుతోందని సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

