చరిత్ర.. ప్రకృతి.. ఉల్లాసం
సింధుదుర్గ్‌లో మూడు రోజుల పాటు ఓరుగల్లు పరపతి సంఘం విహారయాత్ర
ఛత్రపతి శివాజీ కోట, పురాతన ఆలయాల సందర్శన
సభ్యుల సంక్షేమం, సంఘం ఆర్థిక అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం
కాకతీయ, వరంగల్ : విజ్ఞానం, వినోదం, చారిత్రక విశేషాల మేళవింపుగా ఓరుగల్లు పరపతి సంఘం చేపట్టిన మూడు రోజుల మహారాష్ట్ర విహారయాత్ర మంగళవారం ఉత్సాహంగా ముగిసింది. గత ఆదివారం హైదరాబాద్ నుంచి విమానంలో సింధుదుర్గ్ చేరుకున్న సభ్యులు తర్కార్లి దేవ్‌బాగ్‌లో అరేబియా సముద్ర తీరాన ఉన్న రిసార్ట్‌లో బస చేశారు. ఆటపాటలతో సందడి చేస్తూ డీజేలో తెలంగాణ పాటలతో ఉత్సాహంగా గడిపారు. రెండో రోజు ఉదయం స్థానిక బీచ్‌లో సముద్ర స్నానాలు చేసిన అనంతరం దేవ్‌గఢ్‌కు బయలుదేరారు. కొంకణ్ తీరంలోని 900 ఏళ్ల పురాతన కుంకేశ్వర్ ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. సముద్ర తీరంలోని కొండపై మహాదేవుడు లింగరూపంలో కొలువుదీరిన ఆలయ విశేషాలను తెలుసుకున్నారు. అనంతరం దేవ్‌గఢ్ పార్కును సందర్శించి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఆ తర్వాత పడవల్లో అరేబియా సముద్రంలోని సింధుదుర్గ్ కోటను సందర్శించారు. మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోటలోని దూద్ బావి, దహి బావి, శక్కర్ బావి, కోనేరు, శివరాజేశ్వర్ ఆలయం, భవానీమాత ఆలయంతో పాటు శివాజీ జెండాను వీక్షించారు. సముద్ర మార్గంలో పోర్చుగీసు, డచ్, బ్రిటిష్ దాడులను ఎదుర్కొనేందుకు నిర్మించిన కోట ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం సభ్యులను ఆకట్టుకుంది. అనంతరం రాజ్‌కోట్‌లోని 91 అడుగుల భారీ శివాజీ విగ్రహాన్ని సందర్శించి జై శివాజీ నినాదాలు చేశారు.
రిసార్ట్‌లో సంఘం సర్వసభ్య సమావేశం
మూడో రోజు మంగళవారం డైరెక్టర్ల నేతృత్వంలో తర్కార్లి దేవ్‌బాగ్‌లోని రిసార్ట్‌లో సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సభ్యుల సంక్షేమం, సంఘం ఆర్థిక అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సింధుదుర్గ్ పర్యటనకు ముగింపు పలికి విమానంలో బయలుదేరి మంగళవారం సాయంత్రం వరంగల్ చేరుకున్నారు. ఈ యాత్రలో డైరెక్టర్లు మందా శ్రీనివాస్, కత్తెరశాల వేణుగోపాల్, గాదె మధుసూదన్, ముష్కమల్ల సుధాకర్, పాలకుర్తి వేణుగోపాల్‌తో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ ప్రాంతానికి చెందిన ఓరుగల్లు పరపతి సంఘంలో అన్ని వర్గాల వారు సభ్యులుగా కొనసాగుతున్నారు. పొదుపు, రుణ వితరణ ద్వారా ఆర్థిక అవసరాలను తీర్చుకుంటూ, రెండేళ్లకోసారి విజ్ఞాన, విహారయాత్రలు నిర్వహిస్తున్నారు.

