యూజీడీ ప్రాజెక్టుపై కేంద్రం సాంకేతిక సమీక్ష
ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన అదనపు కార్యదర్శి తారా
నగర ఆదాయ వనరుల పెంపుపై కమిషనర్ వెంకన్న వివరణ
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: గ్రేటర్ వరంగల్ నగరంలో భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం లభించిన నేపథ్యంలో, ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డి తారా బుధవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాంకేతిక సమీక్ష నిర్వహించారు. బల్దియా కమిషనర్ టి వెంకన్న తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యూజీడీ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ సాంకేతిక అంశాలను సమీక్షించిన అదనపు కార్యదర్శి, తదుపరి కార్యాచరణపై పలు సూచనలు చేశారు. అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయ వనరులు, స్వంత ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ఉన్న అవకాశాలపై కమిషనర్‌ను వివరాలు కోరారు. దీనిపై కమిషనర్, ప్రస్తుతం కార్పొరేషన్‌కు సమకూరుతున్న ఆదాయ మార్గాలతో పాటు, అదనపు ఆదాయ సమీకరణకు చేపట్టదగిన వివిధ చర్యల గురించి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, పబ్లిక్ హెల్త్ డీఈ కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

