డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె
ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలి
ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి
పని భారం తగ్గించి రిటైర్మెంట్ ప్రయోజనాలు అందించాలి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్
కాకతీయ, హనుమకొండ : ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 15 నుంచి సీఐటీయూ, బీఆర్టీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి, ఆశా వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు రాగుల రమేష్ తెలిపారు. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, పని భారం తగ్గించాలని కోరుతూ బుధవారం జిల్లా వైద్యాధికారికి, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వోకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా రాగుల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా అమలు చేయలేదని విమర్శించారు. వేతనాల పెంపు కోసం అనేక సందర్భాల్లో ఆందోళనలు, పోరాటాలు, చలో అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. వేతనాలు పెంచకపోగా అదనపు పనిభారం మోపుతూ ఆశా వర్కర్లతో అధిక పని చేయిస్తున్నారని ఆరోపించారు.
ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలి
ఆశా వర్కర్లకు రూ.50 లక్షల జీవిత బీమా కల్పించాలని, మరణించిన సందర్భంలో అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.50 వేలు ఇవ్వాలని రమేష్ డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్‌గా రూ.5 లక్షలు చెల్లించాలని, పదవీ విరమణ అనంతరం చివరిగా పొందిన పారితోషికంలో సగం మొత్తాన్ని పెన్షన్‌గా ఇవ్వాలని కోరారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. సమ్మె సన్నాహాల్లో భాగంగా నవంబర్ 16న ఆశా వర్కర్లు చేపట్టనున్న జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాగుల రమేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా కన్వీనర్ కోఆర్డినేటర్ నాయిని రవి, ఆశా యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు చుంచు రాజేశ్వరి, సీహెచ్ శ్రీవాణి, జే. శ్వేత, జి. పొదిలి, నవమణి, అరూరి లత, బీఆర్టీయూ ఆశా యూనియన్ నాయకులు బండారి మంజుల, ప్రేమలత, సుజాత, కవిత, లావణ్య, విజయ, తిరుమల, నిర్మలతో పాటు పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

