ప్రైవేట్ భూముల్లో గూండాగిరి
భూదందాల్లో కిరాయి నేతల హవా!
వివాదాస్పద భూములే టార్గెట్..
సెటిల్‌మెంట్ల పేరుతో పైసా వసూల్
చిన్న తగాదాలను పెద్దవిగా చేసి ఇరువర్గాలపై ఒత్తిళ్లు
భూ యజమానులను బెదిరిస్తూ రూ.లక్షల్లో డిమాండ్లు
రాజకీయ పెద్దల ముసుగులో కొందరి అక్రమ వ్యవహారాలు
యువకులకు డబ్బు ఆశ చూపి భూవివాదాల్లోకి దింపుతున్న కిరాయి లీడర్లు
కాజీపేట, కడిపికొండ, ధర్మసాగర్, మడికొండ, దర్గా ఏరియాల్లో సెటిల్‌మెంట్లు
కాకతీయ, హన్మకొండ : ప్రైవేట్ భూములు, నివాస స్థలాలే లక్ష్యంగా కొందరు కిరాయి నేతలు, గూండాలు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు కాజీపేట పరిసర ప్రాంతాల్లో కలకలం రేపుతున్నాయి. భూ వివాదాల్లోకి చొరబడి తగాదాలను మరింత జటిలం చేయడం, భూ యజమానులను బెదిరించడం, సెటిల్‌మెంట్ల పేరుతో ఇరువర్గాల నుంచి లక్షల రూపాయలు డిమాండ్ చేయడం కొందరి వ్యవహారశైలిగా స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రజాప్రతినిధుల పేర్లు, పలుకుబడిని అడ్డుపెట్టుకుని మరికొందరు కిరాయి నాయకులుగా వ్యవహరిస్తూ సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూముల విలువ పెరుగుతున్న కొద్దీ వివాదాల్లో జోక్యం చేసుకుని డబ్బులు దండుకునే ముఠాల కార్యకలాపాలు పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మడికొండ కేంద్రంగా భూ సెటిల్‌మెంట్ల వ్యవహారం
మడికొండ ఔటర్ రింగ్‌రోడ్డు పరిసరాలు, ధర్మసాగర్, అయోధ్యపురం, కడిపికొండ, కాజీపేట, రాంపూర్‌తో పాటు హనుమకొండలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ భూ వివాదాల్లో కొందరు వ్యక్తులు జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మడికొండకు చెందిన ఒక సామాజిక వర్గంలో నాయకుడిగా చెలామణి అవుతున్న వ్యక్తి పలు భూ సెటిల్‌మెంట్లలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం సాగుతోంది. తన వెంట కొంతమంది యువకులను తిప్పుకుంటూ వివాదాస్పద భూముల వద్దకు తీసుకెళ్లడం, యజమానులపై ఒత్తిడి తీసుకురావడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు కారణమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తగాదాలు పెంచి.. ఇరువైపులా లక్షల వసూళ్లు
భూములకు సంబంధించిన చిన్నపాటి వివాదాల్లోకి ప్రవేశించి వాటిని పెద్ద సమస్యలుగా మార్చడం, కొత్త అభ్యంతరాలు సృష్టించడం, ఆ తర్వాత పరిష్కారం పేరుతో డబ్బులు డిమాండ్ చేయడం కొందరి పద్ధతిగా ఆరోపణలు వస్తున్నాయి. ఒకవైపు భూమి యజమానులను, మరోవైపు ఎదుటి పక్షాన్ని బెదిరిస్తూ ఇరువర్గాల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. కోట్ల రూపాయల విలువైన భూములు కోర్టు కేసులు, వివాదాల్లో చిక్కుకుంటాయనే భయంతో యజమానులు సమస్య నుంచి బయటపడేందుకు ఎంతో కొంత చెల్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూవివాదాల్లో కొందరు ప్రజాప్రతినిధుల పేర్లు, పలుకుబడిని ఉపయోగించుకుంటూ మరికొందరు కిరాయి నేతలుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైనప్పుడు యువకులను వెంటబెట్టుకుని భూముల వద్దకు వెళ్లడం, బలప్రదర్శన చేయడం, యజమానులను భయపెట్టడం ద్వారా ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బు ఆశ చూపి యువకులను ఇలాంటి వ్యవహారాల్లోకి దింపుతూ.. వారి భవిష్యత్‌ను సైతం పణంగా పెడుతున్నారని చర్చ జరుగుతోంది. ఈ తరహా చర్యలతో భూముల యజమానులే కాకుండా చిన్నచిన్న స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకోవాలనుకునే సామాన్యులు సైతం ఆందోళనకు గురవుతున్నారు.
భూదందాలపై పోలీసుల నిఘా అవసరం
వివాదాస్పద భూములపై కొత్త అభ్యంతరాలు సృష్టించడం, వాటిని కోర్టు కేసుల వరకు తీసుకెళ్తామంటూ భయపెట్టడం ద్వారా యజమానులపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భూమి ఏళ్ల తరబడి వివాదంలో చిక్కుకుంటే ఆర్థికంగా నష్టపోతామనే భయంతో కొందరు బాధితులు రాజీకి వస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇదే అవకాశంగా చేసుకుని సెటిల్‌మెంట్ల పేరుతో భారీ మొత్తాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాజీపేట, మడికొండ, ధర్మసాగర్, అయోధ్యపురం, కడిపికొండ, రాంపూర్ ప్రాంతాల్లో భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్న వ్యక్తుల వ్యవహారాలపై సమగ్ర విచారణ జరగాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ప్రైవేట్, నివాస భూముల్లోకి చొరబడి బెదిరింపులకు పాల్పడుతున్నవారు, సెటిల్‌మెంట్ల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తున్నవారిపై ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. భూకబ్జాలు, బలవంతపు సెటిల్‌మెంట్లకు అడ్డుకట్ట వేసి సామాన్యుల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

