ఆడా.. మగా.. చెప్తే జైలే..! స్కానింగ్ సెంటర్లపై కలెక్టర్ కొరడా..!
– వరంగల్ లో 7 ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు
– లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు.. చట్టం ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు
– కాశీబుగ్గ, ఎల్ బి నగర్, గాయత్రి కాలనీలో కమిటీ సభ్యుల సోదాలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పీసీపీఎన్ డీటీ చట్టం అమలుపై మంగళవారం జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాశీబుగ్గ, ఎల్ బి నగర్, గాయత్రి కాలనీ ఏరియాలోని 7 ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో జిల్లా తగిన అధికారుల కమిటీ సభ్యులు తనిఖీలు చేశారు.
తనిఖీల్లో ప్రతి స్కానింగ్ కేంద్రంలోని రికార్డులు, రిజిస్టర్లు, యంత్రాల నిర్వహణ, చట్టపరమైన నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులకు స్పష్టమైన హెచ్చరిక చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకూడదని, శిశువు ఆడా, మగా అనే విషయాన్ని తల్లిదండ్రులకు గానీ, ఇతరులకు గానీ వెల్లడించకూడదని సూచించారు. పీసీపీఎన్ డీటీ చట్టాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తనిఖీల్లో వరంగల్ ఆర్డీఓ సుమ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజిరెడ్డి, ఎంహెచ్ఎన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సాజిదా, అభ్యుదయ సేవా సమితి అధ్యక్షులు మండల పరశురాములు పాల్గొన్నారు.


