డిప్యూటీ సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం!
భట్టి కాళ్లపై పడిన ఎన్‌హెచ్ఎం మహిళా ఉద్యోగినులు
వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన సమయంలో ఘటన
డిప్యూటీసీఎంలో పర్యటనలో మహిళా పోలీసులేరీ..?
28 రోజులుగా ఆందోళన చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు
నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉన్న విషయం ఎందుకు గుర్తించలేదు..
గుర్తించి కూడా అధికారులు లైట్ తీసుకున్నారా..?
పోలీసు వర్గాలతో పాటు ప్రజల్లోనూ భద్రతా వైఫల్యంపై చర్చ
కాకతీయ, హనుమకొండ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో పోలీసుల భద్రతా ఏర్పాట్లపై తీవ్ర చర్చ మొదలైంది. 28 రోజులుగా ఆందోళన చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ, మహిళా ఉద్యోగులు సహా కొందరు ఆయన కాళ్లపై పడటం కలకలం రేపింది. డిప్యూటీ సీఎం చుట్టూ పటిష్ఠమైన భద్రతా వలయం ఉన్నప్పటికీ ఉద్యోగులు ఇంత దగ్గరకు ఎలా చేరుకున్నారు? నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? అనే ప్రశ్నలు ఇప్పుడు పోలీసు వర్గాలతో పాటు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు 28 రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు డిప్యూటీ సీఎంను కలవాలని వారు ప్రయత్నించడం సహజమే. ఇంతకాలంగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులు ఆయన పర్యటన సందర్భంగా వినతిపత్రం ఇచ్చేందుకు వస్తారనే కనీస అంచనా పోలీసు నిఘా విభాగానికి లేదా ఉండి కూడా లైట్ తీసుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. ముందస్తు సమాచారం సేకరించడంలో వైఫల్యమా? లేక భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యమా? అన్న కోణంలో చర్చ సాగుతోంది.
పదుల సంఖ్యలో వైస్సార్ నగర్ వాసులు అదుపులోకి
వైఎస్సార్ నగర్ గుడిసెలవాసులు, బీఆర్ఎస్ నేతలను పోలీసులు అర్ధరాత్రి, తెల్లవారుజామున చర్యలు చేపట్టి పదుల సంఖ్యలో అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది స్టేషన్లకు కూడా తరలించారు. మరికొంతమందిని గృహ నిర్బంధం చేశారు. నిరసనలు, ఆందోళనలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటున్న పోలీసులు.. 28 రోజులుగా నిరసన చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు డిప్యూటీ సీఎంను కలిసేందుకు వస్తారనే విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయారన్న సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పర్యటనల్లో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు డిప్యూటీ సీఎం వద్దకు చేరుకుని కాళ్లపై పడే పరిస్థితి రావడం భద్రతా సిబ్బంది అప్రమత్తతపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఆయన చుట్టూ ఉన్న భద్రతా వలయంలో మహిళా పోలీసుల సంఖ్య, వారి విధుల నిర్వహణపై కూడా చర్చ జరుగుతోంది. మహిళా ఉద్యోగులు ముందుకు వచ్చినప్పుడు వారిని నియంత్రించేందుకు తగినంత మంది మహిళా పోలీసులు ఎందుకు అందుబాటులో లేరు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

