భూరీసర్వే లో తప్పు చేస్తే జైలే
నవంబర్ నెలాఖరులోగా తొలి విడత
70 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయాలి
అవకతవకలకు పాల్పడితే సస్పెన్షన్, క్రిమినల్ కేసు
మంత్రి పొంగులేటి హెచ్చరిక
ఏడాదిన్నరలో మూడు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే పూర్తి
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : భూముల రీసర్వే ప్రక్రియను ప్రజలకు మేలు జరిగేలా పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. భూమి కోసం అన్నదమ్ములైనా కొట్టుకుంటారు అనే సామెతను గుర్తుచేసిన మంత్రి, రీసర్వేలో చిన్న తప్పు జరిగినా అది తరతరాల తగాదాకు దారితీస్తుందని, అందుకే నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తొందరపాటుతో తప్పులు చేయొద్దని స్పష్టం చేశారు. నవంబర్ నెలాఖరులోగా ప్రతి జిల్లాలో తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాలు, నక్షా లేని గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయాలని లక్ష్యం పెట్టారు. ప్రతి మండలంలో ప్రత్యేక సర్వే బృందాలను ఏర్పాటు చేసి, లైసెన్స్ డ్ సర్వేయర్ల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. రైతుల సమక్షంలోనే సర్వే చేయాలని, ముందుగా నోటీసులు ఇచ్చి, కౌన్సెలింగ్ నిర్వహించాలని, సర్వే పూర్తయిన గ్రామాల్లో దండోరా వేయించి అభ్యంతరాలు స్వీకరించాలని చెప్పారు. అసైన్డ్ భూముల పట్టాలు అసలైనవా, నకిలీవా అని క్షుణ్ణంగా పరిశీలించాలని, రీసర్వేలో అవకతవకలకు పాల్పడితే సస్పెన్షన్ తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్, డీఆర్వో విజయలక్ష్మి, వరంగల్ ఆర్డీవో సుమ, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి పాల్గొన్నారు.

