ప్రభుత్వ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు
తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ,ఆత్మకూరు : రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు వీబీ-జీ రామ్ జీ పథకం, గ్రామాల్లో విస్తృతంగా అమలుపరిచలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామంలో తాగునీటి వనరులను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి నల్లా ద్వారా నిరంతర మంచినీటి సరఫరా జరిగేలా అధికారులు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గ్రామాల్లోని బావుల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి భూగర్భ జలమట్టాన్ని పరిశీలించి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జాబ్ కార్డు కలిగిన కూలీకి పని కల్పించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి అర్హులందరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వ విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సస్పెన్షన్‌కు కూడా వెనుకాడబోనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నీటిని వృథా చేసే వారిపై ఫిర్యాదులు అందితే విచారణ జరిపి రూ.500 వరకు జరిమానా విధించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.మంచినీటితో పాటు విద్యుత్‌ను కూడా పొదుపుగా వినియోగించుకోవాలని, నీటి సంరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ప్రజల తాగునీటి అవసరాలు, రైతుల జీవనాధారం వంటి కీలక అంశాలపై రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్షాలు ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకోవడం సరికాదని, వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించి సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.
ప్రతి గ్రామంలో నీటి వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు, ఉపాధి హామీ పనుల అమలు, ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటి సరఫరా లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు.


