విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి
ఏటూరునాగారం జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన
ములుగు జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు
కాకతీయ,ఏటూరునాగారం,రూరల్ : మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, పైడాకుల అశోక్ సూచనలతో ములుగు జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు ఏటూరునాగారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కన్నాయిగూడెం మండల విద్యాశాఖ అధికారి సాంబశివరావు, ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలోని సమస్యలు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వివరాలు సేకరించారు. అనంతరం మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లి భోజన నాణ్యత, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ, ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు సౌందర్య పోషణ భత్యాలు అందించడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చిటమట రఘు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
అలాగే పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో విద్య, ఆరోగ్యం, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పట్ల అవగాహన పెంపొందించేందుకు త్వరలోనే వివిధ అంశాలపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

