నర్సంపేటలో కొత్త పింఛన్ల పండుగ!
1,189 మందికి మంజూరు పత్రాల పంపిణీ
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
కాకతీయ, నర్సంపేట : కొత్తగా మంజూరైన చేయూత పింఛన్లతో అర్హులైన లబ్ధిదారుల ఇళ్లలో ఆనందం వెల్లివిరిసింది. శనివారం నర్సంపేట పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యశారద లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 769 మందికి, మండల పరిధిలో 420 మందికి కలిపి మొత్తం 1,189 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వసంత, డీఆర్డీఏ పీడీ నాగపద్మజ, ఆర్డీఓ ఉమారాణి, మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


