కేసు ఎత్తేస్తేనే కొనుగోళ్లు!
ఏనుమాముల మార్కెట్‌లో వ్యాపారుల పంతం
అడ్తి సెక్షన్ అధ్యక్షుడు లింగారెడ్డిపై కేసు ఉపసంహరణకు డిమాండ్
కలెక్టర్ సమావేశంలోనూ వెనక్కి తగ్గని వ్యాపారులు
సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిపివేయాలని తీర్మానం
తూకాల్లో తేడాలు, అదనపు వసూళ్లపై నోటీసులే వివాదానికి మూలం
వ్యాపారుల డిమాండ్‌తో రైతుల్లో ఆందోళన
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారుల ఆందోళన కొత్త మలుపు తిరిగింది. అడ్తి సెక్షన్ అధ్యక్షుడు లింగారెడ్డిపై మార్కెట్ అధికారులు నమోదు చేసిన కేసును ఉపసంహరించుకుంటేనే కొనుగోళ్లు చేపడతామని వ్యాపారులు పట్టుబడుతున్నట్లు సమాచారం. జిల్లా కలెక్టర్‌తో ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలోనూ ఇదే డిమాండ్‌ను ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిపివేయాలని వ్యాపారులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో మార్కెట్‌లో లావాదేవీలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.
కేసు ఉపసంహరణే ప్రధాన డిమాండ్!
మార్కెట్‌లో తనిఖీలు, నోటీసుల జారీతో మొదలైన వివాదం అధికారులతో వాగ్వాదం, పోలీసు కేసు వరకు వెళ్లింది. లక్ష్మణుడి బృందం తనిఖీల అనంతరం వ్యాపారులకు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత బీట్ వద్ద డీఎంవో నాగరాజుతో వాగ్వాదం, కార్యదర్శి శ్రీనివాస్‌తో వివాదం చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల క్రమంలో అడ్తి సెక్షన్ అధ్యక్షుడు లింగారెడ్డిపై కేసు నమోదైంది. ఇప్పుడు ఆ కేసును ఉపసంహరించుకోవాలని వ్యాపారులు పట్టుబడుతున్నారు. కేసు ఎత్తివేస్తేనే కొనుగోళ్లు ప్రారంభిస్తామన్న వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది.
నోటీసుల్లో బయటపడిన అంశాలివే!
మార్కెట్ అధికారులు జారీ చేసిన నోటీసుల్లో పలు ఉల్లంఘనలను ప్రస్తావించారు. కేకే ట్రేడర్స్ వద్ద తూకంలో రూ.642 తేడా ఉన్నట్లు పేర్కొన్నారు. గుండు అగయ్య ఏజెన్సీలో హమాలీ పేరుతో అదనంగా రూ.490 వసూలు చేసినట్లు గుర్తించారు. కామాచి ట్రేడర్స్ వద్ద ఈ-నామ్ నమోదు, వే బ్రిడ్జి తూకం లేకుండానే వ్యాపారం నిర్వహించినట్లు నోటీసుల్లో ప్రస్తావించారు. గన్నీ బ్యాగులపై రెండు శాతం అడ్తీ కమిషన్, లూజ్ వాహనాలకు హమాలీ వసూళ్లు, మిర్చి బస్తా 49 కిలోలు దాటితే అర కిలో కటింగ్, యార్డుకు రాని సరుకుకు తకపట్టీ వంటి అంశాలనూ తనిఖీల్లో గుర్తించినట్లు వివరించారు.
నోటీసులపై వివాదం.. కేసుపై పట్టుదల
తనిఖీల్లో గుర్తించిన అంశాలపై అధికారులు నోటీసులు జారీ చేయగా, ఆ తర్వాత జరిగిన పరిణామాలు వివాదాన్ని మరింత పెంచాయి. అధికారులపై వాగ్వాదం, కేసు నమోదు నేపథ్యంలో వ్యాపారులు కొనుగోళ్ల నిలిపివేతకు సిద్ధమయ్యారు. అయితే నోటీసుల్లో పేర్కొన్న ఉల్లంఘనలపై విచారణ, వాటికి సంబంధించిన వివరణలు, తదుపరి చర్యలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశాలను పక్కనపెట్టి కేసు ఉపసంహరణనే షరతుగా పెట్టడం మార్కెట్ వ్యవహారాన్ని మరింత సంక్లిష్టం చేస్తోంది.
కొనుగోళ్లు నిలిస్తే రైతుల పరిస్థితి ఏమిటి?
వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేస్తే మార్కెట్‌కు పంట తీసుకొచ్చే రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే పంట అమ్మకాలు, ధరలు, తూకాలు, హమాలీ చార్జీల విషయంలో రైతులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు కొనుగోళ్ల బంద్ నిర్ణయం అమలైతే పంట విక్రయాలు ఎక్కడ చేయాలన్న ప్రశ్న తలెత్తుతుంది. వ్యాపారుల డిమాండ్, మార్కెట్ అధికారుల చర్యల మధ్య రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
కలెక్టర్ నిర్ణయంపై ఉత్కంఠ
కేసు ఉపసంహరణకు వ్యాపారులు పట్టుబడుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మార్కెట్ నిబంధనల ఉల్లంఘనలపై విచారణ కొనసాగిస్తారా? అధికారులపై నమోదైన కేసు విషయంలో చట్టపరమైన ప్రక్రియను అనుసరిస్తారా? కొనుగోళ్లు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది. వ్యాపారుల డిమాండ్ నెరవేరుతుందా లేదా అన్నదానికంటే, మార్కెట్‌లో నిబంధనలు అమలవుతూ రైతుల ప్రయోజనాలు కాపాడబడతాయా అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

