యాసంగిలో వరికి స్వస్తి
ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం!
ఎల్-నినో ప్రభావంతో నీటి ఎద్దడి, విద్యుత్ సమస్యలు తలెత్తే అవకాశం
సబ్సిడీ సౌకర్యాల కోసం నవంబర్ 16లోపు పేర్లు నమోదు చేసుకోవాలి
మండల వ్యవసాయ అధికారి ఎ. అనురాధ
కాకతీయ, హసనపర్తి : రానున్న యాసంగి సీజన్లో ఎల్-నినో ప్రభావంతో నీటి ఎద్దడి, విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగును తగ్గించి ఆరుతడి పంటల వైపు మళ్లాలని హసనపర్తి మండల వ్యవసాయ అధికారి ఎ. అనురాధ సూచించారు. తక్కువ నీటితో అధిక దిగుబడి, ఆదాయం పొందే పంటలను ఎంచుకోవాలని, పంటల మార్పిడి విధానాన్ని పాటించి నీటి వనరులను సంరక్షించుకోవాలని కోరారు. ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ, ఉద్యానవన శాఖల ద్వారా సబ్సిడీపై విత్తనాలు అందించనున్నట్లు తెలిపారు. డ్రిప్, స్ప్రింక్లర్, మల్చింగ్ పరికరాలు, వ్యవసాయ పెట్టుబడులపై ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను వినియోగించుకోవాలని సూచించారు. అడవి జంతువుల నుంచి పంటలను కాపాడేందుకు కనీసం 25 ఎకరాల విస్తీర్ణంలో రైతులు సమూహంగా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఈ సౌకర్యాలు పొందాలనుకునే రైతులు గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి నవంబర్ 16వ తేదీ సోమవారం సాయంత్రంలోపు పేర్లు నమోదు చేసుకోవాలని అనురాధ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రబీ పంటలు సాగు చేస్తున్న రైతులు కూడా అవసరమైన విత్తనాలు, వ్యవసాయ పెట్టుబడుల వివరాలను నమోదు చేయించుకోవాలని కోరారు.

