శ్రీవారి రూపాన్ని చిత్రించిన కళాకారుడు కన్నుమూత
86 ఏళ్ల వయసులో ఎస్.ఎం. శ్రీనివాసన్ తుదిశ్వాస
1970లో తిరుమల మూలవిరాట్టును చూసి రెండు చిత్రాల రూపకల్పన
ప్రపంచవ్యాప్తంగా భక్తుల పూజామందిరాల్లో కొలువైన శ్రీవారి చిత్రం
కాకతీయ, ఏపీ బ్యూరో : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి రూపాన్ని చిత్రించి ప్రపంచవ్యాప్తంగా భక్తుల ఆదరణ పొందిన ప్రముఖ చిత్రకారుడు ఎస్.ఎం. శ్రీనివాసన్ (86) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన గీసిన శ్రీవారి చిత్రం క్యాలెండర్లు, చిత్రపటాల రూపంలో లక్షలాది భక్తుల పూజామందిరాల్లో కొలువుదీరింది. శ్రీనివాసన్ కళాజీవితంలో 1970 సంవత్సరం కీలకంగా నిలిచింది. ఆ ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానం మేరకు తిరుమలకు వెళ్లిన ఆయన గర్భగుడిలోని మూలవిరాట్టును దగ్గరగా పరిశీలించి రెండు చిత్రాలు గీశారు. ఒక చిత్రంలో ఆభరణాలతో అలంకరించిన శ్రీవారిని, మరో చిత్రంలో ఆభరణాలు లేకుండా మూలవిరాట్టు రూపాన్ని చిత్రించారు. ఈ చిత్రాలకు దేవస్థానం ఆమోదం తెలిపినట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. కోవిల్‌పట్టిలోని మందితోప్పు రోడ్డుకు చెందిన శ్రీనివాసన్ పదో తరగతి వరకు చదువుకున్నారు. దేవతామూర్తుల చిత్రకళలో పేరొందిన కొండయ్య రాజు వద్ద శిక్షణ పొందారు. పలువురు దేవతామూర్తులను చిత్రించినప్పటికీ, శ్రీవారి చిత్రం ఆయనకు విశేష గుర్తింపు తెచ్చింది. శివకాశిలోని ముద్రణాలయాలు ఈ చిత్రాన్ని క్యాలెండర్లు, విడి చిత్రపటాల రూపంలో ముద్రించడంతో ప్రపంచవ్యాప్తంగా భక్తులకు చేరింది. ఆయన మరణవార్త తెలుసుకున్న స్థానికులు నివాసానికి చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు.

