రాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపేది?
ఆర్థిక ఇబ్బందులతో ఉద్యమకారుల కుటుంబాల అవస్థలు
తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ల
కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకే స్వరాష్ట్రంలో గుర్తింపు లేకపోవడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండో దశ ఉద్యమకారుల ఓదార్పు యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో సుమారు 50 మంది ఉద్యమకారులు, వారి కుటుంబాలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఉద్యమకాలంలో ఉత్సాహంగా పనిచేసిన వారు నేడు వయోభారం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వాలు పుష్కరకాలంగా వారి సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు. ఉద్యమకారులను అవమానించడం, అవహేళన చేయడం సహించబోమని, వారి గుర్తింపు ప్రక్రియను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రంగంపేటలో దివంగత కొయ్యడ చేరాలు కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు కాపువాడ, నుమచిలీ బజార్, బ్రాహ్మణవాడ, హనుమకొండ చౌరస్తా, లస్కర్ బజార్, టైలర్ స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో ఉద్యమకారులను కలిశారు. తమ కష్టాలను తెలుసుకునేందుకు ఓదార్పు యాత్ర చేపట్టిన గుడిమళ్ల రవికుమార్‌ను ఉద్యమకారులు ఘనంగా సన్మానించారు. యాత్ర బాధ్యులు వోడపెల్లి కృష్ణ, బొల్లిశెట్టి అశోక్, ఎర్రం మనోహర్, అంజద్, బాయిని విజేందర్, వైనాల మహేందర్, షేక్ ఉస్మాన్ అలీ, మేకల రవీందర్, దేవేందర్‌రెడ్డి, జినుకుల లక్ష్మణరావు, వేల్పుల కుమారస్వామి, రాంకుమార్, మల్లేశం, ఇమ్మడిశెట్టి రాజు, కెడ్డల ప్రసాద్, లత, సుమలత, రంభ్రమచారి తదితరులు పాల్గొన్నారు.

