పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ!
మందుల నిల్వలు, వ్యాక్సిన్ల నిర్వహణపై క్షేత్రస్థాయి పరిశీలన
అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకాలు అందించాలి: డాక్టర్ బి. రాజారెడ్డి
కాకతీయ, గీసుకొండ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు టీకాల కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజారెడ్డి సూచించారు. శనివారం గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలు, ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. ఫార్మసీ స్టోర్‌లో మందుల నిల్వలు, ఐఎల్‌ఆర్‌లో వ్యాక్సిన్ల నిల్వలు, వివిధ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మందులు, టీకాల నిల్వలో నిర్దేశిత ప్రమాణాలు పాటించాలని వైద్యాధికారి, సిబ్బందికి సూచించారు. అనంతరం పీహెచ్‌సీ పరిధిలోని గీసుకొండ ఉపకేంద్రంలో నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఇమ్యునైజేషన్ రిజిస్టర్లు, టీకాల పంపిణీ రికార్డులను తనిఖీ చేసి అర్హులైన చిన్నారులు, గర్భిణులందరికీ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు అందించాలని ఆదేశించారు. ప్రతి టీకాల కార్యక్రమాన్ని నాణ్యతా ప్రమాణాలతో నిర్వహిస్తూ, ఏ ఒక్క అర్హుడూ టీకాకు దూరం కాకుండా చూడాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాల సాధనకు వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ శౌర్య శరణ్య, డాక్టర్ అరుణ్‌కుమార్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

