బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు కృషి
ఎంపీ కడియం కావ్య పిలుపు
హనుమకొండలో ఘనంగా జయంతి వేడుకలు
ఎస్సీ ప్రణాళిక ఆవిష్కరణ
కాకతీయ, హనుమకొండ : హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో భారత మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆయన ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, దళితుల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన మహానేతగా బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు. సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు ఆయన చేసిన కృషి ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తదితరులు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఎస్సీ ప్రణాళిక ఆవిష్కరణ
అనంతరం 2025–26 వార్షిక ఎస్సీ ప్రణాళికను ఆవిష్కరించారు. హనుమకొండలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రతిష్ట కోసం ఇప్పటికే భూమిపూజ చేయడం సంతోషకరమని ఎంపీ పేర్కొన్నారు. వచ్చే ఏడాది విగ్రహాన్ని ఏర్పాటు చేసి జయంతిని మరింత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మరియు ప్రైవేట్ విద్యాసంస్థల మధ్య ఉన్న అసమానతలను తొలగించాల్సిన అవసరం ఉందని, విద్యా రంగంలో సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

