ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
అధికారులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశం
కాకతీయ, జనగామ : ప్రజావాణికి వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రెవెన్యూ బెన్షాలోమ్‌తో కలిసి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించారు. ఈ సందర్భంగా వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ ప్రజావాణిలో మొత్తం 224 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినిపిస్తూ వినతిపత్రాలు సమర్పించారు.
ప్రజల సమస్యలపై దృష్టి
ఘనపూర్ స్టేషన్ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన ఓ. వసంత తనకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన జీడ్డి నాగమ్మ తన భూమిని నాలాగా మార్చే ప్రయత్నాలను నిలిపివేసి న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఘనపూర్ స్టేషన్ మండలం నమిలిగొండ గ్రామ పంచాయతీ పరిధికి చెందిన గుంటి గట్టయ్య తన వారసత్వ భూమిని తన పేరుమీదకు రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. రఘునాథపల్లి మండలం కోమళ్ల గ్రామానికి చెందిన మేకల జయలక్ష్మి నివాస స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని వార్డు నంబర్ 24కు చెందిన ఎం. కళ్యాణి తన సొంత స్థలంపై ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, ఆర్టీఓ శ్రీనివాస్ గౌడ్, డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహ రావు, ఎక్సైజ్ ఎస్పీ అనిత, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

