- హిందూ ధర్మ రక్షణకు ప్రతి హిందువు నడుం బిగించాలి
ముక్తానంద స్వామీజీ
కాకతీయ, కరీంనగర్ : హిందూ ధర్మ రక్షణకు ప్రతి హిందువు నడుం బిగించాలని శ్రీశ్రీశ్రీ ముక్తానంద స్వామీజీ పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్‌లోని బృందావన్ గార్డెన్లో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. హిందుత్వం మానవాళి హితం కోరే ధర్మమని, హిందువు మతతత్వవాది కాదని తెలిపారు. మతం వేరు, ధర్మం వేరు అని స్పష్టం చేశారు. హిందువుగా ధర్మం, సంస్కృతిని తెలుసుకుని ఆచరించాలని సూచించారు. కుటుంబ స్థాయిలో మార్పు కోసం మహిళలు కీలక పాత్ర పోషించాలని కోరారు. దేవాలయాలను శక్తివంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కులాల వారీగా విభజన హేయమని, హిందువులు సమైక్యంగా జీవించాలని సూచించారు.
ప్రధాన వక్తగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ విభాగ్ సంపర్క్ ప్రముఖ్ ఎన్నమనేని అశోక్ రావు మాట్లాడుతూ దేశంలో హిందూ సంఘటన అవసరమని అన్నారు. హిందువులు స్వాభిమానం, దేశభక్తి, సేవాభావం పెంపొందించుకోవాలని సూచించారు. దేశభక్తులను తీర్చిదిద్దడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని తెలిపారు.
మహిళా వక్త నీలిమా మాట్లాడుతూ పంచపరివర్తన ద్వారా కుటుంబంలో మార్పులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కుటుంబ విలువలు, సామాజిక సమరసత, స్వదేశీ భావన, పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు పాటించాలని సూచించారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు, సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, భజనలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అశోక్ రెడ్డి, మేకల ఓంప్రకాశ్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు నాంపల్లి రేణుక శ్రీనివాస్, సాగాని కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. భగత్‌నగర్ బస్తీతో పాటు వివిధ కాలనీల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

