సమానత్వమే బసవేశ్వరుడి సందేశం
కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
కాకతీయ, హైదరాబాద్ : సమానత్వం, సమాన అవకాశాల కోసం ఇంకా పోరాడాల్సి వస్తోందంటే సమాజం వెనుకబడి ఉన్నట్టేనని కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అన్నారు. బసవేశ్వరుడి 839వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కవిత మాట్లాడారు. 839 ఏళ్ల క్రితమే బసవేశ్వరుడు ప్రజాస్వామిక విలువలు, సమానత్వ సిద్ధాంతాలను ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు. కుల, వర్ణ, లింగ భేదాలు లేకుండా సమాజం ఉండాలని ఆయన చూపిన మార్గాన్ని ఇప్పటికీ మనం స్మరించుకుంటున్నామన్నారు. పార్లమెంట్‌లో మహిళా బిల్లు ఆమోదం పొందకుండా అనేక శక్తులు అడ్డుకున్నాయని విమర్శించారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు తక్కువ స్థాయిలోనే అవకాశాలు లభించాయని, అసెంబ్లీలో కూడా మహిళా ఎమ్మెల్యేల సంఖ్య చాలా తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
సామాజిక న్యాయమే లక్ష్యం
బసవేశ్వరుడి ఆలోచనలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కూడా ప్రభావం చూపాయని కవిత అన్నారు. ఆయన స్ఫూర్తితోనే తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ వేదిక సామాజిక న్యాయం కోసం పని చేస్తుందని తెలిపారు. మహిళలకు 33 శాతం టికెట్లు, పార్టీ పదవుల్లో కూడా ప్రాధాన్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. బసవేశ్వరుడి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకమని, ఆయన చూపిన సమానత్వ సూత్రాలను ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కవిత పేర్కొన్నారు.

