కంపు కొడుతున్న కాల్వలు
మురుగునీటి దుర్గంధంతో ప్రజల ఇబ్బందులు
దోమల పెరుగుదలతో వ్యాధుల భయం
పెద్దవంగర మండలం శంకర్ తండాలో జనాల అవస్థలు
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గ్రామపంచాయతీ
కాకతీయ, పెద్దవంగర : మురుగునీరు నిల్వతో దుర్వాసన వ్యాపించి జీవనం దుర్భరంగా మారిందని శంకర్ తండ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం టిక్యా తండ గ్రామపంచాయతీ పరిధిలోని శంకర్ తండలో డ్రైనేజీ కాలువలు నిల్వ నీటితో నిండిపోయాయి. కాలువల్లో మట్టిని తొలగించినప్పటికీ మురుగునీరు వెళ్లే మార్గం లేక నిల్వగా మారింది. దీంతో కాలువల నుంచి దుర్గంధం వెదజల్లుతోంది. ఇళ్ల ముందే మురుగునీరు నిల్వ ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఎలాంటి వ్యాధులు వస్తాయోనని భయాందోళనలకు గురవుతున్నారు. దుర్వాసన కారణంగా కొందరు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు. పగలు రాత్రి తేడా లేకుండా దోమలు పెరిగిపోవడంతో మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధుల భయం పెరిగింది. మురుగునీరు నిల్వ ఉండటంతో దోమల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామంలో ప్రజలు ప్రతిరోజూ మురుగు నీటి మధ్యనే జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటు గ్రామపంచాయతీ, అటు సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగునీరు వెళ్లేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

