బీఆర్ఎస్‌కు మళ్లీ అధికారం కల్లా..!
అధికారం కోల్పోయానే ఆక్రోశంతోనే హరీష్‌రావు విమర్శలు
పార్టీలో ప్రాధాన్యం లేక అసంబద్ధతతో మాట్లాడుతున్న హరీశ్ రావు
గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలతోనే అధికారం కోల్పోయారు
సీతారామ ప్రాజెక్టును బీఆర్ఎస్‌ను టార్గెట్
కానీ ఖమ్మం జిల్లా ప్రజల దశాబ్దాల కల అది.. ఆ కలను నెరవేర్చి తీరుతాం
రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ ఎస్ నేతలకు లేదు
కబ్జా భూమిలోనే హరీష్‌రావు సభ
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : బీఆర్ఎస్ నేతల్లో అధికారం కోల్పోయిన ఆందోళన, ఆక్రోశం స్పష్టంగా కనిపిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదని పదే పదే ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఖమ్మంలో సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీలో తగిన ప్రాధాన్యం లేక హరీశ్ రావు అసంబద్ధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాల కారణంగానే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితిలో మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు.
సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లా ప్రజల ఆకాంక్ష
సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లా ప్రజల దశాబ్దాల కల అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. తాను టీడీపీలో ఉన్నప్పుడే దుమ్ముగూడెం ప్రాజెక్టు రూపకల్పన జరిగిందని గుర్తుచేశారు. వైఎస్సార్ హయాంలో ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అయితే వైఎస్సార్ మరణానంతరం ఆ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు వచ్చానని చెప్పారు. బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టుపై మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. సెంట్రల్ వాటర్ కమీషన్ అనుమతులు లేకుండా కమీషన్ల కోసం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రజల కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
కబ్జా భూమిలోనే హరీష్‌రావు సభ
హరీశ్ రావు నిర్వహించిన సమావేశం కబ్జా భూమిలోనే జరిగిందని మంత్రి ఆరోపించారు. కబ్జాలు, అవినీతి ఆరోపణలు ఉన్నవారితో కలిసి నీతులు చెప్పడం సరికాదన్నారు. రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి భారీ స్థాయిలో రుణమాఫీ చేసిన చరిత్ర ప్రస్తుత ప్రభుత్వానిదని పేర్కొన్నారు. గత పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు విమర్శలు చేయడం తగదన్నారు. కబ్జాలు, కమీషన్ల విషయంలో ఆ పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని చెప్పారు. సిద్దిపేటకు వచ్చి రైతాంగం శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన పామాయిల్ ఫ్యాక్టరీపై చర్చకు సిద్ధమా అని హరీశ్ రావును సవాల్ చేశారు. వాస్తవాల ఆధారంగా చర్చకు రావాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

