బీజేపీతో టచ్‌లో రేవంత్ రెడ్డి..
ఆయన ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉండరు
రేవంత్‌కు వారధిలా చంద్రబాబు
ఆంధ్ర నేతల తొత్తుగా ముఖ్యమంత్రి
నాదెండ్ల భాస్కరరావుకు కాంగ్రెస్ మద్దతుగా నిలిచింది
తనను ఎవరూ మంత్రి పదవి నుంచి తొలగించలేదు
సీఎం స్థాయిలో చిల్లర మాటలు మాట్లాడొద్దు
తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
రేవంత్‌రెడ్డిపై జీవన్‌రెడ్డి సంచలన ఆరోపణలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీపై, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న జీవన్ రెడ్డి.. తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉండరని.. బీజేపీలోకి వెళ్తాడని జోస్యం చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. రైతుబంధును సీఎం రేవంత్ రెడ్డి మూడుసార్లు ఎగ్గొట్టారని మండిపడ్డారు. మహిళలకు రూ.2500 ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. అన్ని వర్గాల వారిని మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే అని అన్నారు. కేసీఆర్ జగిత్యాల సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సీనియర్ నేత జీవన్ రెడ్డి తెలిపారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థను నాశనం చేసింది రేవంత్ ప్రభుత్వమే అని అన్నారు. విద్యా శాఖపై సీఎం రేవంత్ ఒక్క రివ్యూ కూడా చేయలేదని తెలిపారు. కేసీఆర్ సభ సక్సెస్ జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు,
అది రేవంత్ భ్రమ
చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని పేర్కొన్న జీవన్ రెడ్డి.. కానీ ఆయన బీజేపీతో టచ్‌లో ఉన్నారని జీవన్ రెడ్డి తాజాగా చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డికి, బీజేపీకి మధ్య వారధిలా ఎలాగూ చంద్రబాబు నాయుడు ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు తనను కాపాడుతాడని రేవంత్ రెడ్డి భ్రమ పడుతున్నారని జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లి సభ వేదికగా తనపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపైనా జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నాదెండ్ల భాస్కరరావు అంశం గురించి రేవంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాదెండ్ల భాస్కరరావుకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ హయంలో నాదెండ్ల భాస్కర్ రావును మంత్రి పదవి నుంచి తొలగించినప్పుడు.. ఆయనకు మద్దతుగా తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
పోలవరానికి పూర్తి సహకారం
తనను ఎవరూ మంత్రి పదవి నుంచి తొలగించలేదని.. తానే రాజీనామా చేసినట్లు జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు. నాదెండ్ల భాస్కర్ రావుకు తాను ఒక్కడిని మాత్రమే కాదని.. ఆ రోజు ఇందిరా గాంధీ, మొత్తం కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచినట్లు స్పష్టం చేశారు. అయితే ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలియదు అనుకుంటా అంటూ జీవన్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆంధ్రా నాయకులకు తొత్తుగా రేవంత్ రెడ్డి మారారని.. ఆంధ్రా నాయకుల చేతిలో కీలు బొమ్మలాగా మారారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. వేం నరేందర్ రెడ్డికి ఎందుకు రాజ్యసభ సీటు ఇచ్చారని ప్రశ్నించారు. 2015లో కూడా వేం నరేందర్ రెడ్డిని టీడీపీ నుంచి ఎమ్మెల్సీ చేయాలని చూసిన రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటులో దొరికిపోయారని ఆరోపించారు. నిన్నటి బీఆర్ఎస్ సభ తెలంగాణ ఉద్యమాన్ని తలపించిందని జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ పుణ్యం వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. అలాంటి ఆయన్ను పట్టుకుని ఉరితీస్తాను అంటావా అని మండిపడ్డారు. ప్రజాపాలన నెపంతో కాంగ్రెస్ ప్రజలను వంచిస్తుందని జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

