హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం
అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది
వంద రోజుల్లో 420 హామీలు అమలు చేస్తామన్నారు
బాండ్ పేపర్లపై రాసిచ్చి.. 1,000 రోజులైనా ఒక్క హామీ నెరవేర్చలేదు
18 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై నిలదీస్తాం
రైతులు, కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై సభలో ప్రశ్నిస్తాం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాకతీయ,తెలంగాణ బ్యూరో : అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి.. బాండ్ పేపర్లపై రాసిచ్చి మరీ ప్రజలను నమ్మించిన కాంగ్రెస్.. 1,000 రోజులు గడిచినా ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారని, ప్రజల తరఫున అన్ని అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. గన్‌పార్క్ వద్ద సోమవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల తరఫున అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు అడుగుతామని చెప్పారు. కేసీఆర్‌ను ఎన్ని రకాలుగా అవమానించినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారని తెలిపారు.
420 హామీలపై సమాధానం చెప్పాలి
వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. 1,000 రోజులు దాటినా ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు అభయహస్తంగా కనిపించిన కాంగ్రెస్.. ఎన్నికల తర్వాత బస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్‌ఎస్‌పై చేస్తున్న కుట్రలు కొత్తేమీ కాదని, గతంలోనూ ఎన్నో చూశామని అన్నారు. ప్రజల సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని సూచించారు. నెల రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపై కూలంకషంగా చర్చ జరగాలని కోరారు.
ఫీజు బకాయిలపై నిలదీస్తాం
18 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎందుకు పేరుకుపోయాయో అసెంబ్లీలో ప్రశ్నిస్తామని కేటీఆర్ చెప్పారు. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపించారు. 97 జీవోను రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం తీసుకొచ్చారని విమర్శించారు. విద్యార్థులు, యువత సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. రైతాంగ సమస్యలపైనా చర్చిస్తామని చెప్పారు. రైతుల తరఫున ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబడతామని అన్నారు. సింగరేణి కార్మికులు, ఆటో డ్రైవర్ల సమస్యలను కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తామని తెలిపారు.
22ఏలో ఆస్తులపై ప్రశ్నిస్తాం
22ఏ ద్వారా ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలే నిషేధిస్తారని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల బంధువులకు అక్రమంగా భూ కేటాయింపులు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్‌వాడీలు, సర్వేయర్ల సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలకు అసెంబ్లీ వేదికగా పరిష్కారం చూపేలా ప్రభుత్వం వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రజల తరఫున ప్రశ్నించేందుకు బీఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

