ఎర్రవల్లిలో ఉద్రిక్తత
కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్ఎస్ నేతల అరెస్టులు
కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద డప్పుల మోతకు కాంగ్రెస్ పిలుపు
పోలీసులు అడ్డుకోవడంపై బీఆర్ ఎస్ నేతల ఆగ్రహం
హకీంపేట నుంచి పాదయాత్రగా బయల్దేరి వెళ్లేందుకు యత్నాలు
కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు నేతల అరెస్టు
బోయిన్పల్లి, జవహర్‌నగర్ పీఎస్‌ల వద్ద ఉద్రిక్తత
అసెంబ్లీ ఘటనపై హైకోర్టులో ప్రభుత్వ పిటిషన్
స్పీకర్‌పై వ్యాఖ్యల వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యకు తీర్మానం
రెండోరోజు హాట్ హాట్‌గా రాజకీయ పరిణామాలు
కాకతీయ,తెలంగాణ బ్యూరో/ ఎర్రవల్లి : అసెంబ్లీ సమావేశాల రెండో రోజూ రాజకీయ ఉద్రిక్తత కొనసాగింది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ డప్పుల మోత కార్యక్రమానికి పిలుపునివ్వడం, దానికి ప్రతిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫామ్‌హౌస్ వైపు బయలుదేరడంతో పరిస్థితి వేడెక్కింది. ఎర్రవల్లి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. హకీంపేట వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, వివేకానంద, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాదయాత్రగా ఎర్రవల్లి వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. మరోవైపు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వ్యాఖ్యల వివాదం తీవ్రరూపం దాల్చింది. దీంతో సభలోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

ఎర్రవల్లికి భారీగా బలగాలు
కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద డప్పుల మోత కార్యక్రమానికి కాంగ్రెస్ పిలుపునివ్వడంతో ఎర్రవల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా బలగాలను మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఫామ్‌హౌస్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వమే పోలీసుల సహకారంతో కాంగ్రెస్ నేతలను ప్రోత్సహిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. సీఎం రేవంత్‌రెడ్డి దాడులకు ఉసిగొల్పుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వైపు బయలుదేరారు.

హకీంపేట వద్దే అడ్డుకున్న పోలీసులు
ఫామ్‌హౌస్ వైపు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను హకీంపేట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ శాసనసభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని, జగదీశ్‌రెడ్డి, వివేకానంద, కొత్త ప్రభాకర్‌రెడ్డి హకీంపేట నుంచి ఎర్రవల్లి వైపు పాదయాత్రగా బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బోయిన్పల్లి, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కేటీఆర్‌ను బోయిన్పల్లి పీఎస్‌కు, హరీశ్‌రావును జవహర్‌నగర్ పీఎస్‌కు తీసుకెళ్లారు. కేసీఆర్ ఇంటిపైకి ఎవరినీ వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఫామ్‌హౌస్ వద్ద వందలాది మంది బలగాలను మోహరించినట్లు వెల్లడించారు. అయితే కాంగ్రెస్ శ్రేణులకు ఎస్కార్ట్, రోప్ పార్టీలు ఇచ్చి ఫామ్‌హౌస్ వైపు తీసుకెళ్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చూపించారు. కాంగ్రెస్ నేతలకు ఎస్కార్ట్ ఇచ్చి తీసుకెళ్తున్నారని విమర్శిస్తూ వెల్డన్ డీజీపీ అంటూ వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ, మీ మోహబత్ కీ దుకాణ్ చూడండి అని అన్నారు. పోలీసులపై నమ్మకం లేదని, తమ నాయకుడిని తామే కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్రేణులను ఎర్రవల్లి వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీస్ స్టేషన్ల వద్ద ఉద్రిక్తత
బీఆర్ఎస్ నేతల అరెస్టుల విషయం తెలియడంతో ఆ పార్టీ శ్రేణులు బోయిన్పల్లి, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లకు భారీగా తరలివచ్చాయి. జవహర్‌నగర్ పీఎస్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించి హరీశ్‌రావు, ఇతర ఎమ్మెల్యేల అరెస్టులకు నిరసన తెలిపారు. బోయిన్పల్లి పీఎస్ వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరువర్గాలను పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేశారు. పీఎస్ ఎదుట రాళ్లు, కుర్చీలు విసిరేసుకున్న ఘటన కూడా చోటుచేసుకుంది. కాంగ్రెస్ మహిళా కార్యకర్తపై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి.
అసెంబ్లీ ఘటనపై హైకోర్టులో పిటిషన్
అసెంబ్లీ ఎదుట తొలిరోజు జరిగిన ఘటనపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించిందని, ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించిందని కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం సవరణ కోరింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట బైఠాయించారని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే పోలీసులు వారిని అడ్డుకున్నారని ఏజీ కోర్టుకు వివరించారు. శాసనసభ్యుల నియమావళిని ఉల్లంఘించినందుకే పోలీసులు చర్యలు తీసుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని, విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లను దూషించారని, పోలీసులను నెట్టివేసి దుర్భాషలాడారని వాదించారు. సభ సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని, స్పీకర్ ఆదేశాలతోనే పోలీసులు ఎమ్మెల్యేలను అడ్డుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
స్పీకర్ చాంబర్లో సీఎం, డిప్యూటీ సీఎం
తొలిరోజు అసెంబ్లీ ఎదుట జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఆయన ఛాంబర్లో పరామర్శించారు. నిన్నటి ఘటనలపై విచారం వ్యక్తం చేసిన సీఎం.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పీకర్‌కు తెలిపారు. ఇదే సమయంలో స్పీకర్ తన పరిధి, అధికారాలపై చిట్‌చాట్‌లో మాట్లాడారు. అసెంబ్లీలో సభ్యుడు కాకపోయినా తాతా మధుపై చర్యలు తీసుకునే అధికారం తనకు ఉందని, అయితే వెంటనే బహిష్కరించే విధంగా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నామని గడ్డం ప్రసాద్‌కుమార్ చెప్పారు. మెయిన్ గేటు తన పరిధిలోనే ఉంటుందని, మహిళా సభ్యులపై అనుచితంగా ప్రవర్తించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
స్పీకర్ వ్యాఖ్యలపై సభలో రగడ
స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుచిత వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్రంగా స్పందించింది. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. అనంతరం తీర్మానాన్ని శాసనమండలికి పంపించారు. స్పీకర్‌ను అవమానించామనే పశ్చాత్తాపం బీఆర్ఎస్ నేతల్లో కనిపించడం లేదని దామోదర రాజనర్సింహ అన్నారు. రాజ్యాంగపరమైన అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి అవమానానికి గురికావడం బాధాకరమని పేర్కొన్నారు. స్పీకర్‌ను అవమానించడం అంటే ఒక వ్యక్తిని అవమానించడం కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్పీకర్‌ను తిట్టడం అంటే సభ మొత్తాన్ని దూషించినట్లేనని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎమ్మెల్సీల తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందన్నారు. ఎస్సీ వర్గాల నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉన్నందున ఆయన పదవిని గౌరవించాలని సూచించారు. స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సభలో డిమాండ్ చేశారు. స్పీకర్ పదవికి ప్రజాస్వామ్యంలో అత్యున్నత గౌరవం ఉందని, దానిని కాపాడుకోవాలని సూచించారు. తాతా మధును శాసనమండలి నుంచి సస్పెండ్ చేయాలని ఎంఐఎం డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని త్వరగా ముగించి ఇతర ప్రాధాన్య అంశాలపై చర్చ చేపట్టాలని అక్బరుద్దీన్ కోరారు.
బీజేపీ వాకౌట్.. రాగమయి విమర్శలు
సభా సమయం వృథా చేస్తున్నారంటూ బీజేపీ శాసనసభ నుంచి వాకౌట్ చేసింది. తొలిరోజు జరిగిన ఘటనలు నీచాతినీచమైన సంస్కృతికి నిదర్శనమని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. స్పీకర్‌పై బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. నియమావళి ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సభ తీసుకునే ఎలాంటి చర్యకైనా కట్టుబడి ఉంటామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్లో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాగమయి విమర్శించారు. రోజుకొక వేషంతో డ్రామాలు చేస్తున్నారని అన్నారు. మహిళా పోలీసుల పట్ల బీఆర్ఎస్ నేతలు అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. చొక్కాలు విప్పి మహిళా పోలీసుల మొహాలపై విసిరేశారని మండిపడ్డారు. వారిని ఇలాగే ఉపేక్షిస్తే మరింత రెచ్చిపోయే ప్రమాదముందని, సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇద్దరు ఎమ్మెల్సీలకు కోర్టులో ఊరట
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిల రిమాండ్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఇద్దరు ఎమ్మెల్సీలు పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అసెంబ్లీ సమావేశాల రెండో రోజు పరిణామాలను చూస్తే.. తొలిరోజు సభ గేటు వద్ద మొదలైన ఘర్షణ రెండో రోజు ఎర్రవల్లి వరకు విస్తరించింది. కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ కార్యక్రమానికి పిలుపు, దానికి బీఆర్ఎస్ ప్రతిస్పందన, పోలీసుల మోహరింపు, నేతల అరెస్టులు, పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళనలు ఒకవైపు కొనసాగగా.. మరోవైపు స్పీకర్‌పై వ్యాఖ్యల వివాదం సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ ఘర్షణకు కారణమైంది. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో అసలు ప్రజా సమస్యలపై చర్చకు ఎంత సమయం దొరుకుతుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

