ప్రతి విద్యార్థి స్వతంత్రంగా చదవగలగాలి
పఠన సామర్థ్యంలో ఖమ్మం జిల్లా 85 శాతానికి వృద్ధి..
ఉపాధ్యాయుల నిరంతర కృషి వల్లే ఈ అద్భుత ఫలితాలు
వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్.. ఏఐ వినియోగం
వచ్చే ఏడాది 100 శాతం లక్ష్యంతో పనిచేయాలి
ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం: జిల్లాలోని ప్రతి విద్యార్థి ఎవరి సాయం లేకుండా, ధారాళంగా చదవగలిగే స్థాయికి చేరుకోవడమే లక్ష్యంగా ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమ విజయోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత ఆరు నెలల కాలంలో విద్యార్థుల పఠన సామర్థ్యంలో గణనీయమైన మార్పు వచ్చిందని, ఇది జిల్లా గర్వించదగ్గ విజయమని కొనియాడారు. కార్యక్రమం ప్రారంభం నాటి పరిస్థితులను గుర్తుచేస్తూ కలెక్టర్ కీలక గణాంకాలను వెల్లడించారు. “అక్టోబర్‌లో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు కేవలం 11 శాతం మంది విద్యార్థులు మాత్రమే వాక్యాలు చదవగలిగే స్థితిలో ఉండేవారు. కానీ, 21 వారాల నిరంతర కృషి తర్వాత ప్రస్తుతం 85 శాతం మంది విద్యార్థులు (సుమారు 21,309 మంది) ధారాళంగా వాక్యాలను చదవగలుగుతున్నారు. ఇది కేవలం ఒక రోజులో వచ్చిన మార్పు కాదు, ప్రతి వారం వ్యూహాలను మారుస్తూ అంచనాలను విశ్లేషించడం వల్ల సాధ్యమైంది” అని వివరించారు. రాష్ట్ర సగటు వాక్య పఠనం 32 శాతం కాగా, ఖమ్మం జిల్లాలో అది 52 శాతానికి చేరుకోవడం విశేషమన్నారు.

సాంకేతికతతో సులభతరమైన విద్యా బోధన
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారికి వేర్వేరు పాఠ్య సామగ్రిని రూపొందించామని కలెక్టర్ తెలిపారు. ఉపాధ్యాయులపై అదనపు భారం పడకుండా ఏఐ సాంకేతికతతో కూడిన యాప్‌ను అభివృద్ధి చేశామని, దీని ద్వారా విద్యార్థుల ప్రగతిని అంచనా వేయడం సులభతరమైందని చెప్పారు. రోజూ సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు కేటాయించి కథలు చదివించడం, విశ్లేషించడం వంటి కార్యక్రమాలతో పిల్లల్లో పఠనంపై నమ్మకం పెంచామన్నారు. ఎస్సీఈఆర్టీ బృందం జరిపిన తనిఖీల్లో కూడా జిల్లా డేటా వాస్తవంగా ఉన్నట్లు తేలడం ఈ కార్యక్రమం యొక్క పారదర్శకతకు నిదర్శనమని పేర్కొన్నారు.
వచ్చే ఏడాదికి కొత్త లక్ష్యాలు
ముందుముందు విద్యార్థుల పఠన వేగాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిమిషానికి 30 నుండి 50 పదాల వరకు చదవగలిగేలా, చదివిన విషయాన్ని విశ్లేషించే నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి జిల్లాలో 100 శాతం మంది విద్యార్థులు వాక్య పఠనంలో రాణించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్ డే రోజున ఇలాంటి మంచి కార్యక్రమ విజయోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఈసీఆర్ అమలులో ప్రతిభ కనబరిచిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కలెక్టర్ మెమోంటోలు అందజేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత విద్యార్థులు, వారి తల్లిందండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం చేసి వారితో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఈఓ చైతన్య జైనీ, విద్యాశాఖ ప్లానింగ్ కో-ఆర్డినేటర్ రామకృష్ణ, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

