పర్యావరణ పరిరక్షణ.. ప్రతి ఒక్కరి బాధ్యత..
భవిష్యత్ తరాల మనుగడకు పర్యావరణమే ఆధారం
ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్క నాటాలి
ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : భూమి మనకు ప్రసాదించిన సహజ వనరులను కాపాడుకుంటూ పర్యావరణ పరిరక్షణను ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మాతృ భూమి దినోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. సత్య శారద మాట్లాడుతూ భవిష్యత్ తరాల మనుగడ సురక్షితంగా ఉండాలంటే పర్యావరణ సమతుల్యతను కాపాడటం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణపై కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్క నాటాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలని సూచించారు. నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కేవలం ప్రభుత్వ పథకాలతోనే కాకుండా ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
సామాజిక బాధ్యతగా మొక్కల పెంపకం
ప్రకృతి వనరులను వృధా చేయకుండా సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ డా. సత్య శారద వెల్లడించారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, అదనపు కలెక్టర్ వై.వీ. గణేష్, జెడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, జిల్లా విద్యాధికారి రంగయ్య నాయుడు, అటవీ శాఖ అధికారులు మరియు వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

