జనగణనలో స్వీయ గణనపై అవగాహన పెంచాలి
*మండల స్థాయి అధికారుల సమావేశంలో తహసీల్దార్ ఎండి రియాజుద్దీన్
కాకతీయ, గీసుగొండ: జనగణన–2027లో భాగంగా స్వీయ గణన విధానంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తహసీల్దార్ ఎండి రియాజుద్దీన్ తెలిపారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనగణన–2027 కార్యక్రమంపై మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల మండల స్థాయి ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రియాజుద్దీన్ మాట్లాడుతూ, తొలి దశగా గృహ గణన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సౌలభ్యం కల్పించేందుకు ఏప్రిల్ 26 నుండి మే 9 వరకు స్వీయ గణన విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి కుటుంబం తమ ఇంటి మరియు కుటుంబ సభ్యుల వివరాలను ఆన్లైన్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు వివరించారు.ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా స్వీయ గణనలో పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి,ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో ఎంపీడీఓ వి.కృష్ణవేణి,ఎంపిఓ పాక శ్రీనివాస్, ఫీల్డ్ ట్రైనర్ రాంగోపాల్ రెడ్డి, ఏఎస్ఓ ఉదయశ్రీ,గ్రామ కార్యదర్శులు,గ్రామ పాలన అధికారులు,పాల్గొన్నారు.

