గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పంచాయితీలు పనిచేయాలి..
*జిల్లా పంచాయితీ అధికారి కటకం కల్పన
కాకతీయ, గీసుగొండ: గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పంచాయితీలు పనిచేయాలని జిల్లా పంచాయితీ అధికారి కటకం కల్పన అన్నారు. జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించు కొని జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయితీగా గుర్తింపు పొందిన మరియపురంలో శుక్రవారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించగా ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపీఓ కల్పన మాట్లాడుతూ మరియపురం గ్రామానికి జాతీయ స్థాయిలో అవార్డు రావడం గ్రామస్థుల సమిష్టి కృషి ఫలితమని తెలిపారు.జిల్లాలోని 300 పైచిలుకు పంచాయతీలకు మరియపురం మార్గదర్శకంగా నిలుస్తుందని కొనియాడారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన 9 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో మరియపురం ముందంజలో ఉండటం అభినందనీయ మన్నారు.పంచాయతీ రాజ్ వ్యవస్థలో గ్రామ సభే అత్యున్నతమైందని, గ్రామానికి అవసరమైన అంశాలను గ్రామ సభలోనే చర్చించి నిర్ణయించుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలోని నర్సరీ,పల్లె ప్రకృతి వనం,డంపింగ్ యార్డ్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ పాక శ్రీనివాస్,పంచాయితీ కార్యదర్శి బైరి స్వప్న,సెర్ప్ సీసీ బొజ్జ సురేశ్,వార్డు సభ్యులు, ఏఎన్ఎంలు,అంగన్వాడీ టీచర్లు,ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

