మహిళా మావోయిస్టు లొంగుబాటు
జనజీవన స్రవంతిలోకి ముడియం రామే అలియాస్ రజిత
తక్షణ సహాయంగా రూ. 25వేల నగదు అందజేత
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ పిలుపు
కాకతీయ, ములుగు: పోలీసు శాఖ నిర్వహిస్తున్న ‘పోరు కన్నా ఊరు మిన్న – మన ఊరికి తిరిగి రండి’ అవగాహన కార్యక్రమం ములుగు జిల్లాలో సత్ఫలితాలనిస్తోంది. నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన మహిళా సభ్యురాలు ముడియం రామే అలియాస్ రజిత, మావోయిజాన్ని విడిచిపెట్టి శుక్రవారం జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ సమక్షంలో లొంగిపోయింది. ప్రభుత్వ పునరావాస సదుపాయాలపై అవగాహన పొంది, ప్రశాంత జీవితం గడపాలనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన రజిత గతంలో సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ ఇన్‌ఛార్జ్, 9వ ప్లాటూన్ కమాండర్ విజ్జాలు అలియాస్ ఐతూ ఆధ్వర్యంలో సభ్యురాలిగా పనిచేసినట్లు ఎస్పీ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ ‘సరెండర్ పాలసీ’ని అమలు చేస్తోందని, లొంగిపోయిన వారికి నగదు ప్రోత్సాహకాలు, వైద్య సేవలు, పునరావాస సహాయం అందిస్తూ సమాజంలో గౌరవప్రదంగా బతికేందుకు పూర్తి మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు.
అడవిని వీడి రావాలి..
ఇంకా అడవుల్లో ఉన్న మావోయిస్టు సభ్యులు కూడా హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా లొంగిపోయిన రజితకు సరెండర్ పాలసీ కింద రూ. 25,000/- తక్షణ పునరావాస ఆర్థిక సహాయాన్ని ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు.

