రైతులు, మిల్లర్లు సమన్వయంతో ముందుకు సాగాలి
మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ములుగులో రైస్‌మిల్ అసోసియేషన్ భవనం ప్రారంభం
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో వరి సాగు విస్తారంగా ఉన్న నేపథ్యంలో రైతులు, రైస్ మిల్ యజమానులు పరస్పర ఐక్యతతో ముందుకు సాగాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైస్ మిల్ అసోసియేషన్ భవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలోని సాగునీటి వనరులు రైతులకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని, వరి ఉత్పత్తిలో ములుగు అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. “మిల్లర్లు కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారే. వ్యాపారంలో రాణిస్తూనే, రైతుల సమస్యలను అర్థం చేసుకుని వారికి అండగా నిలవాలి” అని సూచించారు. కొత్త భవనం మిల్లర్లందరికీ ఒక ఉమ్మడి వేదికగా నిలవాలని ఆకాంక్షించారు.
బియ్యం సేకరణలో కేంద్రం సహకరించాలి..
జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మిల్లింగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నా, కేంద్రం నుంచి బియ్యం లిఫ్టింగ్‌లో (సేకరణలో) జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల మిల్లర్లు సొంతంగా నిల్వ చేయాల్సి వస్తోందని, అధిక ఉష్ణోగ్రతల వల్ల ధాన్యం బరువు తగ్గి ఆర్థికంగా నష్టపోతున్నామని వివరించారు. బాయిల్డ్ రైస్ టార్గెట్ పెంచాలని, మిల్లర్లకు స్పష్టమైన కోటాను కేటాయించి మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేయాలని ప్రవీణ్ కోరారు. గత బకాయిల చెల్లింపులో అధికారుల చొరవను అభినందిస్తూనే, భవిష్యత్తులో డిఫాల్ట్ కాకుండా ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్ మరియు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

