మహిళలకు కాంగ్రెస్ తీరని అన్యాయం
రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్న మిత్రపక్షాలు
ధ్వజమెత్తిన ఆదిలాబాద్ ఎంపీ గోడం లోకేష్
కాకతీయ, ములుగు ప్రతినిధి: పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అడ్డుకుని మహిళా లోకానికి తీరని అన్యాయం చేశాయని ఆదిలాబాద్ ఎంపీ గోడం లోకేష్ విమర్శించారు. ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని రాయల్ ప్లాజాలో నిర్వహించిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. సమ్మక్క-సారలమ్మలకు నమస్కరించి తన ప్రసంగాన్ని ప్రారంభించిన లోకేష్.. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. “పరిపాలన, రక్షణ, సివిల్ సర్వీసుల్లో మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారు. వారికి చట్టసభల్లోనూ తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే సంకల్పంతోనే కేంద్రం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. అయితే ప్రతిపక్ష పార్టీలు దీనికి మోకాలడ్డటం దురదృష్టకరం” అని మండిపడ్డారు. కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ బిల్లుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు.
2029 నాటికి అమలు..
బీసీ, ఓబీసీ వర్గాలకు సైతం కాంగ్రెస్ పార్టీ సరైన న్యాయం చేయలేదని లోకేష్ విమర్శించారు. దేశంలో జనాభా మార్పుల దృష్ట్యా డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అవసరమని, దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా సీట్ల సంఖ్య పెంచేలా కేంద్రం యోచిస్తోందని వివరించారు. మహిళా రిజర్వేషన్లను 2029 నాటికి పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరికొండ బలరాం, మహిళా అధ్యక్షురాలు సుమలత మరియు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

