సీఐ విశ్వేశ్వర్‌కు ప్రశంసా పత్రం
విధుల్లో నిబద్ధతకు కమిషనర్ సున్‌ప్రీత్ సింగ్ గుర్తింపు
పొగాకు ఉత్పత్తుల నియంత్రణపై ప్రత్యేక ప్రశంసలు
కాకతీయ, గీసుగొండ: గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ తన విధుల్లో చూపిన ప్రతిభకు గాను వరంగల్ పోలీస్ కమిషనర్ సున్‌ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందుకున్నారు. మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన క్రైమ్ రివ్యూ సమావేశంలో ఈ బహుమతిని అందజేశారు. గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కా, తంబాకు వంటి నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై సీఐ విశ్వేశ్వర్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, చిన్నపిల్లలు వ్యసనాల బారిన పడకుండా ఆయన చేపట్టిన నిఘా, అవగాహన కార్యక్రమాలను కమిషనర్ ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సందర్భంగా కమిషనర్ సున్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. సీఐ విశ్వేశ్వర్ చూపిస్తున్న క్రమశిక్షణ, అంకితభావం ఇతర అధికారులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజాసేవలో పోలీసులు ఇదే రకమైన నిబద్ధతతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

