మల్లెపూల అలంకరణలో సుబ్రహ్మణ్యేశ్వరుడు
ఊకల్ హవేలీలో వైభవంగా విశేష పూజలు
భారీగా తరలివచ్చిన భక్తులు
కాకతీయ, గీసుగొండ: మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం మల్లెపూల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేసవి కాలాన్ని పురస్కరించుకుని స్వామివారికి చల్లదనం కోసం ఆలయ అర్చకులు ఈ ప్రత్యేక అలంకరణను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు వేద మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు జరిపారు. అనంతరం ఆలయాన్ని, గర్భాలయాన్ని సుగంధ భరితమైన మల్లెపూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మల్లెపూల అలంకరణలో ఉన్న నాగేంద్రుడిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామస్తులు మరియు భక్తులు పాల్గొన్నారు.

