ట్రైబల్ వర్సిటీలో ఎయిమ్స్ వైద్య బృందం
వీసీ ప్రొఫెసర్ వై. ఎల్. శ్రీనివాస్‌తో భేటీ
త్వరలో రెండు సంస్థల మధ్య కుదరనున్న ఒప్పందం
కాకతీయ, ములుగు: ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని మంగళవారం హైదరాబాద్ ఎయిమ్స్ సీనియర్ వైద్యుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వై. ఎల్. శ్రీనివాస్‌ను వారు మర్యాదపూర్వకంగా కలిసి, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవల మెరుగుదలపై చర్చించారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, వైద్య సేవల విస్తరణకు ఈ యూనివర్సిటీని నోడల్ కేంద్రంగా మార్చాలని ఎయిమ్స్ ప్రతిపాదించినట్లు వీసీ వెల్లడించారు. ఇందులో భాగంగా మెడికల్ సైన్సెస్‌లో పలు సర్టిఫికేట్ కోర్సులను ప్రారంభించేందుకు ఎయిమ్స్ మొగ్గు చూపుతోందని తెలిపారు. గిరిజన విద్యార్థులకు వైద్య విద్యలో ప్రాథమిక మెళకువలు అందించేలా ఈ కోర్సులు దోహదపడతాయని పేర్కొన్నారు. త్వరలోనే ఎయిమ్స్ హైదరాబాద్ మరియు సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మధ్య పరస్పర సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వీసీ వివరించారు. ఈ ఒప్పందం ద్వారా పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు మరియు ఆరోగ్య శిబిరాల నిర్వహణలో రెండు సంస్థలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. ఈ పర్యటన గిరిజన ప్రాంతాల్లో వైద్య విద్య, సేవల బలోపేతానికి కీలక మలుపుగా మారుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు.

